మా జనాభా లెక్క తేల్చండి | - | Sakshi
Sakshi News home page

మా జనాభా లెక్క తేల్చండి

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

● ఆదివాసీ నాయకపోడ్‌ల డిమాండ్‌ ● కలెక్టరేట్‌ ముట్టడి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జనాభా గణాంకాల వెనుక తమ జాతి ఉనికిని ఖతం చేసే కుట్ర ఉందని ఆదివాసీ నాయకపోడ్‌ సేవా సంఘం నాయకులు ఆరోపించారు. ఇటీవల సర్వే అబద్ధాల పుట్ట అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతన లేని అంకెలను తెరపైకి తెచ్చి ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది జనాభా కలిగిన తమ తెగను కేవలం 16 వేలుగా చూపడం ప్రభుత్వ అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ఒక్క నిర్మల్‌ జిల్లాలోనే 45 వేల మందికిపైగా నాయకపోడులు ఉన్నారని తెలిపారు. షెడ్యూల్డ్‌ తెగల జాబితాలోని సీరియల్‌ నంబర్‌ 6లో వివిధ తెగలను కలిపి ఉంచడం వల్లే ఈ గందరగోళం తలెత్తుతోందన్నారు. తమ తెగను ఇతరులతో ముడిపెట్టడం వల్ల జనాభా లెక్కింపులో లోపాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. రాబోయే జనగణనలో సీరియల్‌ నంబర్‌ 6 లోని ప్రతీ తెగకు విడివిడిగా కాలమ్‌ కేటాయించి, పారదర్శకంగా లెక్కింపు జరపాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. నిరసనలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకగారి భూమయ్య, స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ సురపు సాయన్న, సాకి లక్ష్మణ్‌, మంద మల్లేశ్‌, సుంచు శ్రీనివాస్‌, అర్జున్‌ లింగన్న, శివ శంకర్‌, బోసని రాజేశ్వర్‌, గుమ్ముల శ్రీనివాస్‌, పుష్పుర్‌ సర్పంచ్‌ నర్సన్న, సర్పంచ్‌ తిరుపతి, దినేష్‌, గణేశ్‌, పోతురాజు శ్రీనివాస్‌, లింగల శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, సాయికృష్ణ, ప్రభాకర్‌, బచ్చన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement