ప్రయాణికుల సంఖ్య ఆధారంగా అదనపు బస్సులు బస్టాండ్లలో ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్లు పండరి, హరిప్రసాద్
నిర్మల్‌టౌన్/భైంసాటౌన్: విద్యా సంస్థలకు మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది ఊళ్ల బాట పట్టనున్నా రు. తీర్థయాత్రలకు వెళ్లనున్నారు. సెలవుల్లో ఎటు వెళ్లాలి అనే విషయమై ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా సెలవుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మల్, భైంసా డిపో మేనేజర్లు పండరి, హరిప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్లలో క్యూ లు, రద్దీ కూడా పెరిగిందని వెల్లడించారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువివరాలు వెల్లడించారు.
సాక్షి : వేసవి రద్దీ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
పండరి, హరిప్రసాద్: వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. ఈ మేరకు నిర్మల్, భైంసా డిపోల పరిధిలోని బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. చల్లని నీరు అందిస్తున్నాం. కుర్చీలు, ఫ్యాన్లు తగినంతగా ఏర్పాటు చేశాం.
సాక్షి :సెలవుల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారా?
పండరి : వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతాం. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, భైంసా, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు బస్సులను పెంచుతాం. బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కాకుండా అవసరం మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం.
సాక్షి : ఎన్ని బస్సులు ఉన్నాయి. ఏయే రూట్లలో ఎక్కువగా నడుపుతున్నారు?
పండరి : ప్రస్తుతం నిర్మల్ డిపోలో బస్సుల కొరత లేదు. డిపోలో మొత్తం 156 బస్సులు ఉన్నా యి. ఇందులో ఐదు రాజధాని, రెండు లహరి బస్సులు ఉన్నాయి. రాజధాని బస్సులు జేబీ ఎస్ , ఎయిర్‌పోర్ట్‌కు నడుపుతున్నాం. లహరి బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు వరకు వెళ్తాయి. నిర్మల్ డిపోబస్సులు రోజుకు 66500 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఏసీ బస్సులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి.
హరిప్రసాద్: భైంసా డిపోలో 75 బస్సులు ఉన్నాయి. వీటిలో 47 హైర్ బస్సులు, 28 సంస్థ బస్సులు ఉన్నాయి. 126 మంది కండక్టర్లు, 47 మంది రెగ్యులర్, 94 మంది హైర్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. డిపో నుంచి ప్రతీరోజు 72 బస్సు సర్వీసులు నడుపుతున్నాం. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, నాందేడ్, ధర్మాబాద్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సోమ, శనివారాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో బస్సు సర్వీసుల కొరత లేకుండా చూస్తున్నాం.
సాక్షి : వేసవిలో ఆర్టీసీ బస్సుల టూర్లు ప్లాన్ చేస్తున్నారా?
పండరి : ప్రతిసారి వేసవిలో ఆర్టీసీ బస్సుల విహారయాత్రను ఏర్పాటు చేస్తాం. ఈ వేసవిలో అయోధ్య, కాశీ, ప్రయోగ్‌రాజ్, రామేశ్వరం, అరుణాచలం, పూరి, కోణార్క్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ యాత్రలకు బస్సులు నడపడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈసారి గోవాకు కూడా స్పెషల్‌గా ప్లాన్ చేశాం. ఈ టూర్లకు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తాం.
సాక్షి : కండక్టర్, డ్రైవర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
పండరి : వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కండక్టర్ డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మూడు రోజులకు ఒకసారి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందిస్తున్నాం. అంతేకాకుండా డ్రైవర్లకు తలకు రుమాలు కట్టుకోవాలి, ఐదు లీటర్ల వాటర్ క్యాన్, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు ప్లాన్ చేస్తున్నాం.
సాక్షి : బస్టాండ్లలో ఫ్యాన్లు పనిచేయడం లేదు..!
హరిప్రసాద్: భైంసా డిపో పరిధిలో భైంసా, ముధోల్, కుభీర్, బాసర, లోకేశ్వరం బస్టాండ్లు ఉన్నాయి. అన్ని బస్టాండ్లలోనూ ఫ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. అవిపని చేస్తున్నాయి. ఇంకా, ప్రయాణికుల కోసం బస్టాండ్లలో తాగునీటి వసతి ఏర్పాటు చేశాం. కొన్నిచోట్ల గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.
సాక్షి : బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
పండరి : బస్సు షెల్టర్ లేక ఎండలో ఉంటున్న ప్రయాణికుల కోసం ప్రస్తుతం ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పలు బస్‌స్టాప్‌ల వద్ద షెడ్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ, ఎక్కడ షెడ్లు అవసరమో గుర్తిస్తున్నాం. రద్దీ ఉండే స్టాప్‌ల వద్ద త్వరలో షెడ్లు వేయిస్తాం.
హరిప్రసాద్ : భైంసా పట్టణంతోపాటు నిర్మల్, నిజామాబాద్, కుభీర్ మార్గాల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎండలో వేచి ఉంటున్నారు. భైంసాలో నిర్మల్ చౌరస్తా, కుభీర్ మార్గంలో మున్సిపల్ చౌరస్తా, నిర్మల్ మార్గంలో అర్లి ఎక్స్‌రోడ్, ఇతర ప్రాంతాల్లో బస్‌షెల్టర్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారం కోసం ప్రయత్నం చేస్తున్నాం.


