● బాసర వద్ద ప్రతిపాదన.. నేటికీ పెండింగ్ ● గత పుష్కరాల్లో పుణ్యస్నానాలకు ఇక్కట్లు
భైంసా: బాసర పుణ్యక్షేత్ర అభివృద్ధితోపాటు రానున్న పుష్కరాల్లో గోదావరి జలాలే కీలకం. గత పుష్కరాల్లో లక్షల్లో వచ్చిన భక్తులు పడ్డ ఇబ్బందులను ఇప్పటికీ జిల్లావాసులు గుర్తుచేస్తూనే ఉన్నారు. పుణ్యస్నానాలు ఆచరించడానికీ సరిపడా నీళ్లు లేక, బురదనీటిలో మునగాల్సి వచ్చిందని వాపోతున్నారు. నీటికొరత తీర్చేందుకు అప్పటి నుంచే ప్రతిపాదనలో ఉన్న గోదావరి నదిపై చెక్‌డ్యాం నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. మళ్లీ పుష్కరాలు వస్తున్నా.. దీనిపై కదలిక లేదని విమర్శిస్తున్నారు.
నిర్మాణమే పరిష్కారం..
వేసవిలో గోదావరి నది నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో బాసరలో పుణ్యస్నానాలకు వచ్చిన యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాసార్లు లోతు తెలియని ప్రదేశాల్లోకి వెళ్లి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే చెక్‌డ్యాం నిర్మాణమే శాశ్వత పరిష్కారంగా భావిస్తున్నారు. మరోవైపు బాసర మండలంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. కరెంట్ ఉన్నప్పుడే బోర్లు పని చేసే పరిస్థితి ఉండటంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. గోదావరినదిలో నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరిగి ఈ సమస్యకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
చెక్‌డ్యాం నిర్మాణమైతే..
బాసర వద్ద గోదావరిలో చెక్‌డ్యామ్ నిర్మిస్తే ఎల్లప్పుడూ నీరు నిల్వ ఉంటుంది. బాసర ప్రాంతం పర్యాటకంగా మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది. బోటింగ్, వినోద కార్యక్రమాలు అభివృద్ధి చెందడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. చిన్న వ్యాపారులు, హోటళ్లు, పర్యాటక రంగం మొత్తం లాభపడతాయి. పుష్కరాలు, ముఖ్య పర్వదినాల సమయంలో వచ్చే భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతా పరంగా కూడా చెక్‌డ్యాం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నీటి మట్టం స్థిరంగా ఉండటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. మొత్తంగా బాసర సమగ్ర అభివృద్ధికి గోదావరి చెక్‌డ్యాం నిర్మాణం అత్యవసరంగా మారింది. పర్యాటకం, తాగునీరు, భద్రత, ఉపాధి ఇలా అన్నింటికీ పరిష్కారమార్గం కావడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకో వాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసేందుకు వస్తున్న సీఎం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవిస్తున్నారు.


