ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికలు జరిగిన 50 రోజుల తర్వాత ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. బీఆర్‌ఎస్ మద్దతుతో పురపీఠం బీజేపీ దక్కించుకుంది. వైస్ చైర్మన్ పదవిని బీఆర్‌ఎస్‌కు కేటాయించింది. శనివారం పలు రాజకీయ పరిణామాల మధ్య వాయిదా పడిన ఎన్నిక ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక, వైస్ చైర్మన్‌గా మహ్మద్ షోయబ్ హుస్సేన్ ఎన్నికయ్యారు.
ప్రజాభీష్టం మేరకే పొత్తు..
మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతోనే ప్రజాభీష్టం మేరకే బీఆర్‌ఎస్, బీజేపీ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు దక్కించుకున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం, అవినీతిరహిత పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు కౌన్సిలర్లే ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను ప్రలోభపెట్టి మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని అధికార బలం ఉపయోగించి విఫలమైందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పాలకవర్గం ప్రజలు కోరిన పాలన అందిస్తుందని తెలిపారు.


