త్వరలోనే యూనివర్సిటీ ప్రారంభోత్సవం చేస్తా.. జూన్ 2లోగా ఎయిర్‌పోర్టు భూమిపూజ అయ్యేలా చూస్తా.. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పిప్రి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి
వేదికపై అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్‌చార్జి మంత్రి జూపల్లి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, ఎంపీ గోడం నగేశ్, వేంన రేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, ప్రేంసాగర్‌రావు, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు
కైలాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మళ్లీ వస్తానని.. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా నాడు చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రిలో సోమవా రం నిర్వహించిన బహిరంగసభకు హాజరయ్యారు. భట్టితో కలిసి వచ్చిన ఆయన రూ.1,238 కోట్ల వ్యయంతో కూడిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ మేరకు సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, మండలస్థాయి నాయకుల వద్దకు వచ్చి వారితో కరచాలనం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతున్నట్లుగా వెల్లడించారు. ఇంద్రవెల్లిలో పీసీసీ అధ్యక్షుడిగా దళిత గిరిజన, దండోరాతో తాను, పీపుల్స్ పాదయాత్రతో భట్టి చేపట్టిన పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ముందుకు సాగుతున్నామన్నారు. అపారమైన ఖని జ సంపదతో పాటు సంస్కృతికి నిలయమైన ఈ ప్రాంతంలో విద్య, వైద్యం అందాల్సిన అవసరముందన్నా రు. బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మార్చి 2027 వరకు సాధ్యం కాదని ఆ తర్వాత దాన్ని పరిశీలి స్తామన్నారు. ప్రాణ హిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి రైతులకు సాగునీటిని అందిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం జూన్ 2లోగానే శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుతో పాటు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేసి దాని ప్రారంభోత్సవానికి సైతం తానే హాజరవుతానని భరోసానిచ్చారు. రెండు నెలల కోసారి జిల్లాకు వస్తూనే ఉంటానని, నిధులు తెస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, ఎంపీ గోడం నగేశ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ప్రేంసాగర్‌రావు, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, మాలోత్ రాందాస్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, జిల్లాల కలెక్టర్లు రాజర్షి షా, హరిత, కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట
నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేశాయి. అభివృద్ధి, సంక్షేమం కోసం కమిట్‌మెంట్‌తో పనిచేసే పార్టీ కాంగ్రెస్. రెండేళ్లలోనే ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్‌కార్డులు, ఉచిత విద్యుత్ వంటి హామీలన్నీ నేరవేర్చాం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి పెద్దపీటవేస్తూ ముందుకు సాగుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలో వందకు పైగా సీట్లను కై వసం చేసుకుంటాం. – బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ చీఫ్


