రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్‌ ట్రిప్స్‌, బెంజ్‌కారు! | Wrath Of Snake Threat Gave Nashik Godman Trip To 21 Nations, Mercedes | Sakshi
Sakshi News home page

రూ. 5 కోట్ల దోపిడీ : దొంగబాబా 21 ఫారిన్‌ ట్రిప్స్‌, బెంజ్‌కారు!

Mar 26 2026 12:45 PM | Updated on Mar 26 2026 1:05 PM

Wrath Of Snake Threat Gave Nashik Godman Trip To 21 Nations, Mercedes

దొంగ బాబా, ‍జ్యోతిష్యం పేరుతో  బడా బాబులను కూడా మోసంచేసిన స్వయం ప్రకటిత బాబా అశోక్ ఖారత్‌కు సంబంధించిన మరో భయంకరమైన బండారం బయటపడింది. అనేకమంది మహిళలపై అత్యాచారం ఆరోపణలతో ఇప్పటికే అరెస్టయిన  67 ఏళ్ల అశోక్‌పై ఇప్పుడు దోపిడీ, నరబలి బెదిరింపులు, మూఢనమ్మకాల నిరోధక చట్టం ఉల్లంఘన వంటి తీవ్రమైన ఆరోపణలతో మరో కేసు నమోదైంది. జ్యోతిష్కుడిపై జరుగుతున్న దర్యాప్తులో, టర్కీలోని ఒక గుహ నుండి సేకరించిన ‘అరుదైన తేనె’ కీలకమైన ఆధారంగా వెలుగులోకి ఇది వచ్చింది.

నాసిక్ కేంద్రంగా పనిచేసే జ్యోతిష్కుడు అశోక్‌ కోట్లలో దోచేశాడంటూ తాజాగా సంచలన ఆరోపణలు, ఫిర్యాదులు నమోదైనాయి.  పూణేకు చెందిన ఒక బిల్డర్ నుండి అశోక్ సుమారు  రూ. 5 కోట్లు వసూలు చేశాడు. ఇందుకోసం బాధితుడిని ఒక రేంజ్‌లో వేధించాడు.  

21 దేశాల పర్యటన, లగ్జరీ కారు
బాధితుడి ఫిర్యాదు మేరకు తన లాజిస్టిక్స్ వ్యాపారం సజావుగా సాగాలంటే "అవతార్ పూజ" చేయాలని బెదిరించాడు. ముఖ్యంగా 'నాగ దేవత' ఆగ్రహానికి గురవుతారని, చెప్పింది చేయకపోతే పాము కాటుకు బలి కాక తప్పదంటూ భయపెట్టాడు. ఇందుకోసం ఒక నకిలీ పాము,  పిచ్చిరాళ్లు (మ్యాజిక్‌ స్టోన్‌) అంటూ నమ్మబలికాడు. అతీత శక్తుల కోసం 21 దేశాలు తిరగాలని నమ్మించి, బాధితుడి ఖర్చుతో విదేశీ పర్యటనలు చేశాడు. అంతేకాదు  అతడికా  చావు భయాన్ని పుట్టించి, ఒక మెర్సిడెస్ బెంజ్ కారును కొనిపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మిర్గావ్‌లోని తన ఫామ్‌హౌస్ నిర్మాణ ఖర్చును, ఫర్నిచర్ ఖర్చును కూడా బాధితుడి నుంచే బలవంతంగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో వెల్లడించారు. . ఆ 'స్వామి'పై జరుగుతున్న దర్యాప్తును మార్చి 19న అధికారికంగా SITకి అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 

దీని ప్రకారం మార్చి 17న ఒక మహిళ ఇచ్చిన అత్యాచారం ఫిర్యాదు మేరకు  అశోక్‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆఫీసుకి పిలిపించి, భర్తను చంపేస్తానని బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసుల విచారణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. నిందితుడిపై నమోదైన కేసులలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఏమైనా ఉందేమోనన్న అంశాన్ని కూడా SIT పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఇదీ చదివండి: ఫోన్ లాక్ కోడ్‌ భార్యకు పంపి, జ్యోతిష్కుడి సూసైడ్‌ మిస్టరీ

అశోక్ ఖారత్‌కు చెందిన చెందిన "శివనిక సంస్థాన్" బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్‌  చేశారు. భారీ ఎత్తున  జరిగిన మనీ లాండరింగ్ మరియు నల్లధనం లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోంది.  అలాగే నిందితుడితోపాటు,  అతని కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. సోదాల్లో భాగంగా పోలీసులు రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక రివాల్వర్, 21  తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: కోట్లాది మందికి గుడ్‌ న్యూస్‌ : భారీగా చమురు కొనుగోలు

అశోక్ ఖారత్,  అద్భుత  తేనె
అశోక్ ఖారత్ గతంలో మర్చంట్ నేవీలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. తనను తాను 'కెప్టెన్' అని పిలుచుకునే ఆయనకు రాజకీయ నాయకులు, వివిఐపిలు (VVIPs) క్లయింట్లుగా ఉండేవారు. లైంగిక పటుత్వం, శారీరక బలహీనత లాంటి సమస్యలకు ఎక్కువగా  అతణ్ని సంప్రదించేవారు. కిలో 'మాయా' టర్కీ తేనెను రూ. 15 లక్షలకు  విక్రయించేవాడు. యవ్వనాన్ని ప్రసాదించే "అద్భుత ప్రయోజనాలు" ఉన్న "రహస్య తేనె"గా ప్రచారం చేస్తూ, ఖాతాదారులకు అమ్మేవాడు. ప్రస్తుతం  నిందుతుడిపై నరబలికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు కూడా రావడంతో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement