ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘాజియాబాద్‌లోని ఒక హై-రైజ్ సొసైటీలో 42 ఏళ్ల జ్యోతిష్కుడు రాజ్‌వీర్ ఆత్మహత్య మిస్టరీ వీడింది. జ్యోతిష్కుడిగా ఉంటూ ఇతరుల జాతకాలు చెప్పే వ్యక్తి, అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
రాజ్‌వీర్ 13వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్‌వీర్ ఆత్మహత్య తర్వాత, పోలీసులు అతని ఇంటిని తనిఖీ చేయగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్‌లో దుప్పటిలో చుట్టి ఉన్న అతని 70 ఏళ్ల తల్లి సత్నాం మృతదేహం కనిపించింది. బాడీమీద ఎలాంటి గాయాలు లేకపోవడంతో హత్య అనేకోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. కనీసం రెండు రోజుల క్రితమే ఆమె చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే ఆమె మరణానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
అమ్మతో పాటే నేను
తల్లి చనిపోతే తాను కూడా చనిపోతానని రాజ్‌వీర్ గతంలో సన్నిహితులతో చెప్పేవాడని సమాచారం. తల్లి మృతదేహంతో రెండు రోజులు గడిపిన తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.
లక్షల అప్పు, భార్యతో విభేదాలు
రాజ్‌వీర్‌కు సుమారు 15 - 16 లక్షల రూపాయల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే భార్య, కుమారుడికి దూరంగా ఉంటున్నాడు. గత నాలుగు నెలలుగా అతను ఇంటి ఖర్చులకు ఎటువంటి ఆర్థిక సాయం చేయడం లేదని అతని భార్య తెలిపింది.
ఆత్మహత్యకు కొద్ది నిమిషాల ముందు రాజ్‌వీర్ తన మొబైల్ ఫోన్ లాక్ కోడ్‌ను భార్యకు మెసేజ్ చేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ను తనిఖీ చేయగా, హర్యానాకు చెందిన ఒక మహిళతో అతను ప్రేమలో ఉన్నాడని, తనకు విడాకులు అయ్యాయని చెప్పి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిసింది. రాజ్‌వీర్ తండ్రిని, సోదరుడిని కోల్పోయాడు. పొరుగువారితో పెద్దగా మాట్లాడేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే తీవ్ర నిరాశకు లోనైన అతను కఠిన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.


