World Organ Donation Day: మొట్టమొదట అవయవాన్ని దానం చేసింది ఎవరో తెలుసా?

World Organ Donation Day 2021 Special Story in Telugu - Sakshi

World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస‍్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. 

తొలి అవయవదానం
ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్‌లోని పీటర్‌ బెంట్‌ బ్రీగమ్‌ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్‌ అనే ‍వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్‌ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్‌ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్‌ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్‌ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్‌ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్‌ని సక్సెక్స్‌ చేసిన డాక్టర్‌ జోసెఫ్‌ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్‌ బహుమతి పొందాడు.

ప్రమాదం లేదు
హెర్రిక్‌ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. 

ఎనిమిది మంది ప్రాణాలు
ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్‌, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది.

జీవన్‌దాన్‌ ట్రస్ట్‌
అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్‌దాన్‌ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్‌కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్‌దాన్‌ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. 

సర్కారు దవాఖానాలు భేష్‌
కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజామ్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్‌ డెడ్‌ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్‌ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. 

బ్రెయిన్‌ డెడ్‌
మెదడులో రక​‍్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్‌ డెడ్‌గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్‌డెడ్‌గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. 

సాక్షి, వెబ్‌డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top