breaking news
Kidney - pankreas
-
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్‌కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్‌సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్‌దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్‌దాన్ ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్‌డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్‌కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్‌దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్‌లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్‌గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్‌డెస్క్ -
అపోలోలో తొలి ఎస్కేపీ సర్జరీ
ఏక కాలంలో కిడ్నీ,పాంక్రియస్ల మార్పిడి సర్జరీ విజయవంతమని అపోలో ప్రకటన అన్నానగర్, న్యూస్‌లైన్: దక్షిణాది వైద్య చరిత్రలోనే మొదటిదిగా చెప్పబడుతున్న సైమల్టేనియస్ కిడ్నీ - పాంక్రియాస్ సర్జరీ (ఎస్కేపీ)ను అపోలో వైద్యులు విజయవంతం చేశారని ఆ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అపోలో ఎండీ ప్రీతారెడ్డి మాట్లాడుతూ త్వరలో అపోలో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సర్జరీకు చెందిన విశేషాలను వివరించారు. పాండిచ్చేరికి చెందిన 52 ఏళ్ల పరమేశ్వరీ రాజశేఖర్ మధుమేహ వ్యాధితో చెడిపోయిన కిడ్నీతో తమ వద్దకు వైద్యం కోసం వచ్చారు. ఈ శస్త్ర చికిత్సకు సారథ్యం వహించిన డాక్టర్ ఆనంద్ కక్కర్ తెలిపారు. బాగా ఆలోచించిన మీదట ఆమెకు చెడిపోయిన కిడ్నీతో పాటు, చక్కెర స్థాయిని నియంత్రించే పాంక్రియాస్ గ్రంధిని కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో అవయవదాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కిడ్నీ - పాంక్రియాస్‌లను అమర్చడం వలన ఆమెను మధుమేహం నుంచి పూర్తిగా విముక్తిరాల్ని చేయవచ్చు. ఈ క్రమంలో తన సహవైద్యులైన డాక్టర్ మనీష్ వర్మ, డాక్టర్ ఆనంద్ రామమూర్తి, డాక్టర్ మహేష్‌లతో కల్సి ఈ సరికొత్త ఎస్కేపీ సర్జరీను పరమేశ్వరికి చేసి విజయం సాధించామన్నారు. టైప్టూ మధుమేహంతో బాధపడుతున్న పరమేశ్వరీ ఈ సర్జరీ అనంతరం పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె పాంక్రియాస్, కిడ్నీలు బాగా పని చేస్తున్నాయని కక్కర్ తెలిపారు. ఈ విధానం ఉత్తర భారతావనిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నారు. రోగి పరమేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ ఈ సర్జరీ తర్వాత తాను అన్ని పదార్థాలనూ యథేచ్ఛగా తినగల్గుతున్నానని తెలిపారు. మరో ఆరు నెలల తర్వాత స్వీట్లను కూడా తాను తినవచ్చునని వైద్యులు తెలిపారన్నారు. తాను వ్యాధి సోకక ముందు ఎలా ఉన్నానో సర్జరీ తర్వాత కూడా అంతే ఉత్సాహం, ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పారు. అపోలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ విభాగం వైద్యుడు డాక్టర్ భామ, అపోలో వైద్యులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.