పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అన్నలు | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అన్నలు

Published Tue, May 14 2024 6:11 PM

Woman Duped Of Rs 2 Lakh By Three Brothers On Instagram

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్‌ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇన్ని రోజులు ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరస్తులు.. దొంగచాటుగా ఓటీపీ సాయంతో యూజర్ల బ్యాంక్‌ అకౌంట్‌లలో సొమ్మును కాజేయడం రివాజుగా మారింది.

కానీ రాను రాను సైబర్‌ మోసగాళ్లు తెలివి మీరుతున్నారు. తాజాగా, చెల్లెమ్మా.. మేం మీకు దేవుడిచ్చిన అన్నయ్యలం అంటూ అందిన కాడికి సొమ్మును దోచేస్తున్నారు.    

ఇన్‌స్టాగ్రామ్‌లో లక్నోకు చెందిన ఓ మహిళను రవికుమార్, రాణా ప్రతాప్ సింగ్, మనోజ్ కుమార్‌లు పరిచయం చేసుకున్నారు. ఆ మహిళ తమపై నమ్మకం పెరిగేలా మెసిలారు. రోజులు గడుస్తున్నాయి. మాటలు కోటలు దాటాయి.

ఆన్‌ లైన్‌ స్నేహాలు కాస్తా.. ఆఫ్‌ లైన్‌లోనే ఇరువురి ఫోన్‌నెంబర్లు ఇచ్చు పుచ్చుకునే వరకు వెళ్లింది. గుడ్‌ మార్నింగ్‌లు, గుడ్‌నైట్‌లు..ఫెస్టివల్‌ విషెస్‌తో ఆమెపై అన్న ప్రేమను ఒలకబోసేవారు. వారిపై ఆమెకు నమ్మకం కలగడంతో వ్యక్తిగత విషయాల్ని షేర్‌ చేస్తుండేది. అయితే ఓ రోజు త్వరలో తన పెళ్లి రోజు అంటూ ఇన్‌ స్టాగ్రామ్‌లో ఆ ముగ్గురికి  చెప్పింది. అంతే ఆమె డబ్బును కాజేయాలని కేటుగాళ్లు ప్లాన్‌ చేశారు.

ప్లాన్‌లో భాగంగా మనోజ్‌కుమార్ బాధితురాలికి ఫోన్‌ చేసి పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన పెళ్లి కానుక ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇది నిజమని నమ్మిన బాధితురాలు షిప్పింగ్ అవసరాల కోసం తన ఆధార్ కార్డు, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను షేర్‌ చేసింది.

కట్‌ చేస్తే విమానాశ్రయంలో తాను కొన్న ఖరీదైన గిఫ్ట్‌ను ఎయిర్‌పోర్ట్‌ అధికారులు పట్టుకున్నారని, దానిని విడిపించేందుకు కొంత మొత్తం చెల్లించాలని మనోజ్ ఆమెకు ఫోన్‌ చేశాడు. డబ్బులు చెల్లించేందుకు ఆమె ఒప్పుకోలేదు. ఫలితంగా బెదిరింపులు ఎక్కువయ్యాయి.  

నేను చెప్పినట్టు చేయకుంటే సీబీఐ, క్రైమ్ బ్రాంచ్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిని ప్రమేయం చేసి నన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించాడు.  

బెదిరింపుల కారణంగా, ఒత్తిడికి గురైన  ఆమె క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.1.94 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మోసపోయామంటూ బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ అభిజిత్‌ శంకర్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో దొరికే ప్రేమల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే ఇలాగే నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. 
 

Advertisement
 
Advertisement