రూ. 440 కోట్లు నష్టం : వేలాది ఐఫోన్లు మాయం

 Wistron Reports Losses Worth Rs 440 Crore Says Thousands of iPhones Stolen - Sakshi

మూడునెలలుగా వివాదం, సహనం కోల్పోయిన ఉద్యోగులు

ఐఫోన్ తయారీ ప్లాంట్‌పై దాడి, భారీగా ఆస్తి నష్టం

రూ. 440 కోట్లు  నష్టం

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఆపిల్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగుల నిరసన ఆందోళన రేపింది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహం‍తో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్‌పై దాడిచేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసంలో తమకు 440 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని  తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ కార్పొరేషన్  తాజాగా ప్రకటించింది.  అసెంబ్లింగ్‌ పరికరాలు, బయోటెక్ డివైజ్‌లు ఇతర పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. అంతేకాదు వేలాది ఐఫోన్లుఎత్తుకుపోయారని ఆరోపించింది. దర్యాప్తునకు స్థానిక అధికారులతో సహకరిస్తు‍న్నట్టు  తెలిపింది.

బెంగళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని  కోలార్ జిల్లాలోని నర్సాపురలో  తైవాన్‌ టెక్‌ దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్‌ ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది.  జీతాల విషయంలో కొన్ని రోజులుగా  ఆందోళన  చేస్తున్న ఉద్యోగులు, సహనం నశించి ప్లాంట్‌లో విధ్వంసానికి తెగబడ్డారు.  కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం, వాహనాలకు నిప్పంటిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికిపైగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.  ఈ విధ్వంసంలో 700 కంప్యూటర్లు ధ్వంసమైనాయనీ,  సుమారు  రూ.40కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని మొదట అంచనా వేశారు. 100 కోట్ల రూపాయల లోపు నష్టాలు సంభవించవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు

ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విస్ట్రాన్, కాంట్రాక్టు కార్మికుల మధ్య వివాదం మూడు నెలలుగా కొనసాగుతోందని తెలిపింది. విస్ట్రాన్ తన కోలార్ యూనిట్ కోసం 8,900 మందిని నియమించుకోవడానికి ఆరు అనుబంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి శివరామ్ హెబ్బర్ తెలిపారు. అయితే ఈ నియామకాలకు సంబంధించి విస్ట్రాన్, కాంట్రాక్టర్లు,ఉద్యోగుల మధ్య ఏర్పడిన వివాదమే హింసకు కారణమై ఉండవచ్చని పరిశ్రమల మంత్రి జగదీష్ శెట్టర్ వ్యాఖ్యానించారు.  కాగా కోలార్ జిల్లాలో నరసపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న తైవానీస్ విస్ట్రాన్ కార్పొరేషన్ తయారీ కేంద్రం దేశంలోని మొట్టమొదటి ఐఫోన్ తయారీ కర్మాగారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top