లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం? | Who is Mizo Opposition Leader Lalduhoma, Know Facts About Him And His Party ZNP In Telugu - Sakshi
Sakshi News home page

Lalduhoma: లాల్దుహోమా ఎవరు? మిజోరం ఎన్నికల్లో ఎందుకు కీలకం?

Published Fri, Dec 1 2023 12:46 PM

Who is Mizo Opposition Leader Lalduhoma - Sakshi

మిజోరం.. దేశంలోని ఒక చిన్న రాష్ట్రం... అసెంబ్లీ కూడా చిన్నదే.  40 మంది సభ్యుల ఈ అసెంబ్లీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో నవంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కారణంగా దేశవ్యాప్తంగా మిజోరం రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈసారి మిజోరంలో ముక్కోణపు పోటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్‌), కాంగ్రెస్‌తో పాటు, ఈసారి లాల్దుహోమా నేతృత్వంలోని జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్‌ఎన్‌పీ)కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో లాల్దుహోమా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యువత నుంచి లాల్దుహోమాకు అత్యధిక ఆదరణ దక్కుతోంది. మిజోరాం అభివృద్ధి గురించి, కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్ నుంచి రాష్ట్రానికి విముక్తి చేయడం గురించి ఆయన మాట్లాడుతున్నారు. మిజోరాం సీఎంకు లాల్దుహోమా గట్టి పోటీదారు అని ఇక్కడివారంతా చెబుతున్నారు. ఇంతకీ లాల్దుహోమా ఎవరు? యువత ఆయనకు ఎందుకు ఆకర్షితులవుతున్నారు?

లాల్దుహోమా మిజోరంనకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. 1977లో ఐపీఎస్ పూర్తి చేశాక, గోవాలో స్క్వాడ్ లీడర్‌గా విధులు నిర్వహిస్తూ స్మగ్లర్ల ఆటకట్టించారు. లాల్దుహోమా సాధించిన విజయాలు మీడియాలో తరచూ కనిపిస్తుంటాయి. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు.
 
లాల్దుహోమా 1984లో ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన పేరిట ఓ ప్రత్యేక రికార్డు కూడా ఉంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన మొదటి ఎంపీగా లాల్దుహోమా నిలిచారు. 1988లో కాంగ్రెస్ సభ్యత్వాన్ని వదులుకున్నందుకు లోక్‌సభ నుండి బహిష్కరణకు గురయ్యారు.

లాల్దుహోమా.. జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్‌ఎన్‌పీ)వ్యవస్థాపక అధ్యక్షుడు. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికల్లో జెడ్‌ఎన్‌పీ నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) కూటమి మొదటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన నిలిచారు.

ఐజ్వాల్ వెస్ట్-1, సెర్చిప్ నియోజకవర్గాల నుండి ఎన్నికైన లాల్దుహోమా.. సెర్చిప్‌కు ప్రాతినిధ్యం  వహించేందుకు మొగ్గుచూపారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2020లో శాసనసభ సభ్యునిగా అనర్హుడయ్యారు. ఇది భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో మొదటి  ఉదంతంగా నిలిచింది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో సెర్చిప్ నుంచి లాల్దుహోమా తిరిగి ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి: చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!

Advertisement
 
Advertisement
 
Advertisement