మాజీ భార్యతో కాంప్రమైజ్‌.. రేప్‌ కేసు రద్దు! మాజీ భర్తకు ఢిల్లీ హైకోర్టు వెరైటీ శిక్ష

Wasting Of Time Delhi HC Orders Man Serve Burgers To Orphans - Sakshi

ఢిల్లీ: అత్యాచారం ఆరోపణలతో మాజీ భర్తపై కోర్టుకెక్కింది ఓ మహిళ.  అయితే.. చివరికి ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి కేసు వాపసు తీసుకునే యత్నం చేశారు. మరి తమ విలువైన సమయాన్ని వృథా చేస్తే న్యాయస్థానం ఊరుకుంటుందా? అందుకే విచిత్రమైన ఓ శిక్ష విధించింది. 

నోయిడా, మయూర్‌ విహార్‌లో బర్గర్‌ సింగ్‌, వాట్‌ ఏ బర్గర్‌ పేరుతో సదరు వ్యక్తికి రెండు బర్గర్‌ రెస్టారెంట్‌లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో బాధితురాలితో విడిపోయి.. మరో వివాహం చేసుకున్నాడతను. అయితే.. వైవాహిక బంధంలో తన భర్త శారీరకంగా, మానసికంగా తనను హింసించాడంటూ 2020లో ఆమె కోర్టును ఆశ్రయించింది. 

రెండేళ్లపాటు కోర్టులో కేసు విచారణ కొనసాగగా.. జులై4వ తేదీన న్యూఢిల్లీ సాకేత్‌ కోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దీంతో ఆ మాజీ భార్య అతనిపై ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు అంగీకారం తెలిపింది. అయితే.. ఈ పరిణామంపై జస్టిస్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టుల విలువైన సమాయాన్ని వృథా చేశారు. ఈ వ్యవధిలో ఎన్నో కీలక అంశాలను చర్చించే వాళ్లం. కాబట్టి, పిటిషనర్‌ కచ్చితంగా సంఘానికి పనికొచ్చే ఏదైనా ఒక పని చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు.. అతనిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటే అనాథలకు బర్గర్‌ అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండు అనాథశ్రమాలను ఎంచుకుని వంద మంది దాకా అనాథలకు బర్గర్‌ అందించాలని ఆ వ్యక్తిని ఆదేశించింది కోర్టు. పైగా శుభ్రమైన వాతావరణంలో ఆ బర్గర్‌లు తయారు చేయాలని, పోలీసులు దగ్గరుండి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. అంతేకాదు.. మాజీ భార్య సమయాన్ని సైతం వృధా చేసినందుకుగానూ రూ.4.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని, అనాథలకు బర్గర్‌లు పంచే రోజునే అది చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top