అనుమానం అతడిని మృగంలా మార్చింది.. అదనపు కట్నం డిమాండ్లు ఆమె జీవితాన్ని భారంగా మార్చాయి. ప్రతి కదలికపై నిఘా, ప్రతి మాటపై అనుమానం, అత్తింటి వేధింపులు.. ఇలా 48 రోజుల కాపురమే ఓ నవవధువుకు నరకయాతనగా మారింది. చివరకు ఆ మానసిక వేదనను తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడి.. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చింది.
పుణే వైష్ణవి హగ్వానే కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అరకేజీ బంగారం, నగదు, కాస్ట్‌లీ కారు కట్నంగా ఇచ్చినప్పటికీ.. సరిపోలేదంటూ అత్తింటి కుటుంబం వైష్ణవిని బలి తీసుకుంది. ఈ ఘటన తర్వాత.. వరకట్నం విషయంలో కొన్ని కులాల పెద్దలు ‘తల్లిదండ్రులు తమకు ఉన్నంతలోనే వివాహం చేయాలి’ అని తీర్మానాలు కూడా చేశారు. అయితే ఆ ఘటన మరువక ముందే.. అదే తరహాలో మహారాష్ట్రంలోనే మరో వరకట్న వేధింపులకు నవవధువు బలైన ఘటన చోటు చేసుకుంది.
అంబర్‌నాథ్‌లో పెళ్లైన 48 రోజుల్లోనే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు.. దీనికి తోడు ప్రతీ చిన్న విషయానికి భర్త అనుమానించడం విశాఖ తిల్కర్(26)ను దారుణంగా కుంగదీశాయి. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు చెబుతోంది ఏంటంటే..
విశాఖకు ఈ ఏడాది ఏప్రిల్ 30న వైద్యుడు నితిన్ తిల్కర్‌తో వివాహమైంది. అడిగినంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే అత్తింట అడుగు పెట్టిన మరుసటి రోజు నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. తాము అనుకున్నంత కట్నకానుకలు రాలేదని తల్లి, మరిది సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇటు నితిన్ కూడా చీటికి మాటికి విశాఖను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇంటి లోపల, బయట.. ఆఖరికి బాత్‌రూమ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విశాఖ ప్రతి కదలికను గమనించాడట..

.. ఎవరితో మాట్లాడినా ప్రశ్నించడం, అనుమానించడం, దాడి చేయడం తరచూ జరిగేది. విశాఖ బలవన్మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు పొరుగును ఉన్నవాళ్లతో మాట్లాడిందని నితిన్ తీవ్రంగా కొట్టాడు. అప్పటిదాకా మౌనంగా భరిస్తూ వచ్చిన ఆమె.. పుట్టింటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. దీంతో ఆమెను ఆ నరకం నుంచి బయటపడేయాలని తల్లిదండ్రులు భావించారు. ఈలోపే.. ఏం జరిగిందో ఏమోగానీ జూన్ 16న ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త నితిన్ తిల్కర్‌తో పాటు అతని తల్లి ఛాయా, సోదరుడు నినాద్‌పై మానసిక, శారీరక వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాల కింద కేసులు పెట్టారు. నితిన్‌ను అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తికాకముందే అనుమానం, నిఘా, వేధింపుల మధ్య తమ బిడ్డ జీవితం అర్థాంతరంగా ముగిసిందంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన కన్నీళ్లు పలువురిని కదిలించాయి.


