సంసద్ రత్న అందుకున్న విజయసాయి రెడ్డి.. రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఉండాలని ఆకాంక్ష

Vijayasai Reddy received Sansad Ratna Award 2023 - Sakshi

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సంసద్‌ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డు అందుకున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..  

మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది . స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది.  అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95% కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని గుర్తు చేశారాయన. అలాగే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందని ఆయన ఆకాంక్షించారు. 

ఇక సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం.. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా సాగింది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా అవార్డు అందుకున్నారు. రవాణా ,సాంస్కృతిక,  పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు దక్కింది.

ఈ సందర్భంగా.. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ..  విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్లో బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. విజయసాయిరెడ్డి ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారు అని దత్తాత్రేయ పొగిడారు. 

మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంటులో గందరగోళం వల్ల  బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు. కానీ స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉంది. పర్యాటక సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషకరం. చార్టెడ్ అకౌంటెంట్, మేధావి  విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సంసద్‌ రత్న అవార్డులను 2010 నుంచి  అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్‌ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్‌ కాగా.. ఇవాళ (మార్చి 25) న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top