విజయ్‌ జైత్రయాత్ర.. టెంట్లు పీకేసిన డీఎంకే | Vijay TVK Crosses 100 Mark In Early Trends | Sakshi
Sakshi News home page

విజయ్‌ జైత్రయాత్ర.. టెంట్లు పీకేసిన డీఎంకే

May 4 2026 10:51 AM | Updated on May 4 2026 11:07 AM

Vijay TVK Crosses 100 Mark In Early Trends

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.. అయితే, అందరి దృష్టి తమిళనాడుపైనే కేంద్రీకృతమైంది. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే సంచలన ఫలితాల దిశగా టీవీకే దూకుడు ప్రదర్శిస్తోంది. తమిళనాడులో 100 స్థానాల్లో టీవీకే ఆధిక్యంతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో విజయ్‌ నివాసానికి నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో టీవీకే చీఫ్‌ విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జెండాలు పట్టుకుని టీవీకే అభిమానులు సందడి చేస్తున్నారు. కేంద్ర బలగాలతో విజయ్‌ నివాసం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. 

కాగా, చెన్నైలో డీఎంకే కార్యాలయం బోసిపోయింది. ఆఫీస్‌ దగ్గర డీఎంకే శ్రేణులు కనిపించడం లేదు. టెంట్లు తీసేసి కుర్చీలు తీసుకెళ్తున్న డీఎంకే కార్యకర్తలు.. ఎన్నికల ఫలితాల షాక్‌తో బోరున విలపిస్తున్నారు. టీవీకే ఆధిక్యం పెరుగుతుండటంతో విజయ్ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎక్కువ శాతం సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌లో డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమిళనాడులో ఓటర్లు మార్పుకోరుకున్నారు. విజయ్‌కు యూత్‌, దళిత్‌ ఓటు బ్యాంకు కలిసొచ్చింది. హిందూవ్యతిరేక ముద్రతో డీఎంకే నష్టపోయిందని రాజకీయ వర్గాల అంచనా వేశాయి.

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో తమిళనాడు దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో విజయ్‌ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోందని యాక్సిస్‌ మై ఇండియా సంచలన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్‌పోల్‌ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్‌ మై తెలిపింది. ఎన్నికల తర్వాత తమిళనాడులో ఎంజీఆర్‌లా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌లా విజయ్‌ సినీరంగం నుంచి వచ్చి నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్‌ పోల్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement