అప్పటి వరకు ఆనందం.. అంతలోనే విషాదం.. లోయలో పడ్డ బస్సు, 14 మంది మృతి

Uttarakhand: Vehicle Falls Into Gorge In Champawat, PM Modi Offers Condolences - Sakshi

రాంచీ: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలవ్వగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. చంపావత్‌ జిల్లాలో సుఖిధాంగ్-దండమినార్ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. తనక్‌పూర్‌లో బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.  ప్రమాద సమయంలో బస్సులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. 
చదవండి: విషాదం నింపిన పుట్టినరోజు వేడుకలు.. 4 కార్లు ధ్వంసం.. ముగ్గురు మృతి

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  లోయలో నుంచి  మృతదేహాలను వెలికి తీస్తున్నారని, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చంపావత్‌ ఎస్పీ వెల్లడించారు. కాగా మృతి చెందిన వారంతా కాకాని దండా, కతోటి గ్రామాలకు చెందిన వారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: నేనున్నా లేకున్నా, మరో 50 ఏళ్లు  కొనసాగాలి: కమల్‌ హాసన్‌

ప్రధాని మోదీ సంతాపం
ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఆయన సంతాపం తెలిపారు. ‘ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో జరిగిన ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక యంత్రాంగం  సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top