రెండు చరణాలకే కట్టుబడతాం | Two stanzas of Vande Mataram will be song at party programmes Says cwc | Sakshi
Sakshi News home page

రెండు చరణాలకే కట్టుబడతాం

Aug 20 2026 4:57 AM | Updated on Aug 20 2026 4:57 AM

Two stanzas of Vande Mataram will be song at party programmes Says cwc

వందేమాతరం పూర్తిగా ఆలపించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సీడబ్ల్యూసీ

రామాలయంలో చందాచోరీ అంశంలో ప్రభుత్వానిదే జవాబుదారీ 

చైనా ఆక్రమణలపై సమాధానం చెప్పాలి 

విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చాల్సిందే 

పోటీ పరీక్షల విధానంలో సంస్కరణలపై కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల నుంచి నివేదికలు 

మరిన్ని నగరాల్లో రాహుల్‌ ‘ఛాత్రోంకీ గూంజ్‌’కార్యక్రమం 

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ: జాతీయగేయం వందేమాతరంను పూర్తిగా ఆలపించాలన్న మోదీ సర్కార్‌ కొత్త నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తప్పుబట్టింది. మహాత్ముడు, నెహ్రూ, నేతాజీ, సర్దార్‌ పటేల్‌ తదితర దిగ్గజ నేతలు 1937లో చేసిన తీర్మానం మేరకే వందేమాతరం గేయంలో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరాభవన్‌’లో బుధవారం మధ్యాహ్నం పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏకంగా నాలుగు గంటలకుపైగా సీడబ్ల్యూసీ భేటీ జరిగింది.

 సీడబ్ల్యూసీ భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాం«దీలతోపాటు అజయ్‌ మాకెన్, కేసీ వేణుగోపాల్, ప్రియాంకాగాం«దీ, అంబికాసోనీ, ముకుల్‌ వాస్నిక్, జైరాం రమేశ్‌లతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌ రెడ్డి(తెలంగాణ), వీడీ సతీశన్‌(కేరళ), సుక్విందర్‌ సింగ్‌ సుఖూ(హిమాచల్‌ ప్రదేశ్‌), డీకే శివకుమార్‌(కర్ణాటక) పాల్గొన్నారు. తర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయాలను కేసీ వేణుగోపాల్, జైరాంరమేశ్‌ మీడియాకు వెల్లడించారు. భేటీలో మొత్తం 88 మంది పాల్గొన్నారని 33 మంది మాట్లాడారని తెలిపారు.

 ‘‘వందేమాతరంలో తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని 1937 అక్టోబర్‌ 28న రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ సూచనమేరకు నాటి దిగ్గజ నేతలు మహాత్మాగాం«దీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, మౌలానా ఆజాద్‌ నిర్ణయించారు. మేం సైతం వాళ్ల నిర్ణయాలకే కట్టుబడి ఉంటాం. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలే ఆలపిస్తాం. వందేమాతరం, జనగణమన అంటే మాకు ఒక భావోద్వేగ అంశం. బీజేపీకి మాత్రం ప్రతిదీ రాజకీయమే’’అని అన్నారు. హల్దా్వనీలో ఖర్గే సభ ముగిసిన తర్వాత ఆ ప్రాంగణాన్ని బీజేపీ అనుబంధ సంఘాలు శుద్ధి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వేణుగోపాల్‌ మండిపడ్డారు. రాజ్యసభ ప్రతిపక్ష నేతగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి విషయంలో ఇలా వ్యవహరించడం దారుణమన్నారు.  

విఫలమైన విదేశాంగ విధానం 
నీట్‌ వంటి కీలక ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో మోదీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానించారు. 2014 ఏడాది నుంచి 154 పేపర్‌ లీకేజీ ఉదంతాలు వెలుగుచూశాయి. నీట్‌ పేపర్‌లీకేజీ ఘటనలో 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి ఉదంతాల్లో 90 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత 12 ఏళ్లలో ఉపాధి అవకాశాలు అడుగంటాయి. విద్యావ్యవస్థ వ్యాపారవ్యవస్థగా తయారైంది.

 జంతర్‌మంతర్‌లో విద్యార్థుల చలో సంసద్‌ ర్యాలీ సహా పలు రాష్ట్రాల్లో ఉద్యమించిన యువతపై ఎలక్ట్రిక్‌ షాక్‌ బ్యాటన్లు, బాష్పవాయుగోళాలు, పెల్లెట్‌ గన్‌లు, ఏకంగా ఏకే–47ను ప్రయోగించారు’’అని సీడబ్ల్యూసీ తీర్మానంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాలు చోరీకి గురైన అంశంలోనూ ప్రభుత్వానిదే జవాబుదారీ అని నేతలు తెగేసిచెప్పారు. కీలక అంశాలపై ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాల్సిన వేళ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు రాకుండా ముఖం చాటేశారని సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. 

పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్షాలు సంపూర్ణ విజయం సాధించాయని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఛాత్రోంకీ గూంజ్‌(విద్యార్థుల గొంతుక) కార్యక్రమానికి యువతలో విశేషమైన స్పందన రావడంతో ఇకపై దేశవ్యాప్తంగా 800 పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని, కొన్ని సభల్లో మాత్రం రాహుల్‌ ప్రసంగిస్తారుని జైరాం రమేశ్‌ తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాలు చైనా ఆక్రమణలోకి వెళ్లాయి. పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. 

విదేశాంగ విధానంలో మోదీ సర్కార్‌ ఘోరంగా విఫలమైంది’’అని జైరాం తెలిపారు. దేశభక్తి గురించి మాట్లాడే వారు ఇప్పుడు అమెరికాకు, చైనాకు లొంగిపోయారని కేసీ వేణుగోపాల్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్య, పోటీ, ఉద్యోగ నియామక పరీక్షల్లో చేపట్టాల్సిన సమస్యలు, యువత లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై విద్యావేత్తలతో చర్చించి నివేదికను సిద్దంచేసి నెల రోజుల్లోపు ఖర్గేకు సమర్పించాలని నలుగురు ముఖ్యమంత్రులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను పెంచకుండా యథాతథంగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ డిమాండ్‌ చేసింది. ఈ 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. దీనిపై తమిళనాడు శాసనసభ ఆమోదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 

విద్య నుంచి ఉపాధికి మార్గం సుగమం చేస్తామన్న ఖర్గే 
సీడబ్ల్యూసీ భేటీలో తొలుత ఖర్గే మాట్లాడారు. ‘‘మోదీ సర్కార్‌ గత 12 ఏళ్లలో విద్యవ్యవస్థను నాశనంచేసింది. 90 వేల పాఠశాలలు మూతబడ్డాయి. విద్య ప్రైవేటీకరణతో ఉన్నత విద్య సామాన్యులకు అందనిద్రాక్ష అయింది. విద్యా సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తులు చొరబడ్డారు. యువతకు విద్య నుంచి నేరుగా ఉపాధి దక్కేలా కాంగ్రెస్‌ సమగ్ర విధానం తీసుకొచ్చే రోజు వస్తుంది. ఎడ్యుకేషన్‌ టు ఎంప్లాయ్‌మెంట్‌ రోడ్‌మ్యాప్‌ తెస్తాం’’అని ఖర్గే అన్నారు. 

ప్రక్షాళన దిశగా ‘సంగఠన్‌ సృజన్‌ అభియాన్‌’ 
రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు కార్యాచరణ, పార్టీ బలోపేతం, సంస్థాగత పటిష్టతపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టి ఎన్నికల తర్వాత పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రస్తావించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసి ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేందుకు దేశవ్యాప్తంగా ‘సంగఠన్‌ సృజన్‌ అభియాన్‌’ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వేణుగోపాల్‌ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం ద్వారానే భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement