చంపేస్తారేమోనని భయపడ్డాం..

Thought Taliban gunmen might kill us says jeet bahadur - Sakshi

తాలిబన్ల నుంచి బయటపడిన జీత్‌ బహదూర్‌

షాజహాన్‌పూర్‌: రెండున్నరేళ్ల క్రితం అఫ్గాన్‌ వెళ్లిన ఓ భారతీయుడు తాలిబన్‌ ఆక్రమణ అనంతరం తిరిగి భారత్‌కు చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలను వివరించారు. తాలిబన్ల చేతిలో దాదాపుగా మరణం ఖాయమనుకున్న పరిస్థితి నుంచి ప్రాణాలతో బయట పడిన సంఘటనలను వణుకుతూ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని చినోరె గ్రామానికి చెందిన జీత్‌ బహదూర్‌ రెండున్నరేళ్ల క్రితం అఫ్గాన్‌లోని ఓ కన్సల్టెన్సీలో సూపర్‌వైజర్‌గా చేరారు. అయితే తాలిబన్‌లు అఫ్గాన్‌ను ఆక్రమించాక పరిస్థితులు మారిపోయాయి.

కార్యాలయాలన్నీ మూతబడ్డాయి. దీంతో మరో మార్గం లేక భారత్‌కు తిరిగి వచ్చేందుకు జీత్‌ సహా అదే కంపెనీలో పని చేస్తున్న 118 మంది భారతీయులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న కాబూల్‌ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందే తాలిబన్లు జీత్‌ వద్ద ఉన్న రూ. లక్ష నగదును, ఇతర వస్తువులను దోచుకున్నారు. డెన్మార్క్‌ ఎంబసీ వద్దకు చేరుకున్న వారిని ‘మీరు అఫ్గాన్‌ హిందువులా’ అని తాలిబన్లు ప్రశ్నించారు. అయితే తాము భారతీయ హిందువులమని చెప్పడంతో వారిని వదిలేశారు. నగదు దోచుకోవడం గురించి ప్రశ్నించగా, అది తాలిబన్లు చేయలేదని సమాధానమిచ్చారని చెప్పారు.

తమ తాలిబన్‌లు అలాంటి పనులకు పాల్పడరని పేర్కొన్నారు. దీంతో చీకట్లోనే వారు నడుచుకుంటూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వేలాది మంది పౌరులు విమానాశ్రయం వద్దే పడిగాపులు కాస్తున్నారు. అక్కడికి చేరుకున్న జీత్‌ బృందం దాదాపు మూడు రోజుల పాటు ఎలాంటి తిండీ తిప్పలు లేకుండా గడిపారు. ఇదిలా ఉండగా, తమకు తిండి లేక అల్లాడుతున్న సమయంలోనే తాలిబన్లు అక్కడి చేరుకొని తమను అయిదు గంటల పాటు ఆరుబయట నేల మీద కూర్చోబెట్టారని అన్నారు. అత్యాధునిక ఆయుధాలు ధరించి ఉన్న తాలిబన్లు తమను హతం చేస్తారని భావించినట్లు చెప్పారు. అయితే భారత్‌ నుంచి వచ్చిన ఆర్మీ విమానం తమను ఎక్కించుకొని ఈ నెల 22న ఢిల్లీ బయలుదేరిందని చెప్పారు.

అప్రకటిత కర్ఫ్యూ..
అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోందని జీత్‌ పేర్కొన్నారు. అన్ని కార్యాలయాలు మూతబడ్డాయని చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రావడం లేదన్నారు. రోడ్ల మీద మహిళలు, పిల్లలు కనిపించడం లేదని పేర్కొన్నారు. మహిళల మీద తాలిబన్లు దాడులు చేసిన ఘటనలేమీ లేనప్పటికీ, గతాన్ని తలచుకొని చాలా మంది భయపడుతున్నారని అన్నారు. దేశం విడిచి వెళ్లవద్దని, ఎలాంటి హాని కలిగించబోమని తాలిబన్లు చెబుతున్నారని వెల్లడించారు.

కాబూల్‌ నుంచి భారత్‌కు 75 మంది..
న్యూఢిల్లీ:  తాలిబన్‌ పాలనలోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌ నుంచి వలసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ నుంచి 75 మంది పౌరులతో పాటు, సిక్కు పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్‌ సాహిబ్‌ ప్రతులను మూడింటిని భద్రంగా అఫ్గాన్‌ నుంచి భారత్‌కు ఐఏఎఫ్‌ యుద్ధ విమానం ద్వారా పంపినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 45 మంది అఫ్గాన్‌ సిక్కులు, హిందువులు ఉన్నట్లు తెలిపారు. మరో 200 మంది అఫ్గాన్‌ సిక్కులు, హిందువులు దేశం విడిచేందుకు ఎదురు చూస్తున్నారని ఇండియన్‌ వరల్డ్‌ ఫోరం అధ్యక్షుడు పునీత్‌ సింగ్‌ చంధోక్‌ తెలిపారు.

గత కొద్ది రోజులుగా వీరు కాబూల్‌ విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలోని గురుద్వారా కర్తే పర్వాన్‌లో ఆశ్రయం పొందినట్లు తెలిపారు. వీరిని తాలిబన్‌ చెక్‌పోస్టుల నుంచి తప్పిస్తూ అమెరికా బలగాలు విమానాశ్రయానికి చేర్చాయని పేర్కొన్నారు. ఈ సంస్థ భారత విదేశాంగ శాఖ, భారత వాయు సేన (ఐఏఎఫ్‌)లతో కలసి అఫ్గాన్‌ నుంచి పౌరులను తరలిస్తోంది. అఫ్గాన్‌ నుంచి వచ్చిన పౌరులు, గురు గ్రంథ్‌ సాహిబ్‌ గురించి కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కూడా ట్వీట్‌ చేశారు. మరోవైపు ఖతార్‌ రాజధాని దోహా నుంచి నాలుగు ప్రత్యేక విమానాల ద్వారా 146 మంది పౌరులు సోమవారం భారత్‌ చేరుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top