ఐపీఎస్‌ కేడర్‌ సమీక్షించండి: అమిత్‌షాతో సీఎం కేసీఆర్‌

Telangana CM KCR Delhi Tour: Meets To Union Minister Amit Shah - Sakshi

పోస్టుల సంఖ్యను 195కు పెంచండి

కేంద్ర హోంమంత్రికి సీఎం వినతి

అమిత్‌ షాతో 45 నిమిషాలు భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినందున ఆయా జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారుల కొరతను అధిగమించేందుకు వీలుగా ఐపీఎస్‌ కేడర్‌ను సమీక్షించి పోస్టుల సం ఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమిత్‌ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఐపీఎస్‌ కేడర్‌ సమీక్షతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలను నివేదిం చారు. సీఎం వెంట ఎంపీ సంతోశ్‌కుమార్‌ ఉన్నారు.

కొత్త పోస్టులు అవసరం..
‘ఆర్టికల్‌ 371–డీ లక్ష్యానికి అనుగుణంగా ఉద్యో గులు, ఉద్యోగార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించాల్సి వచ్చింది. పునర్‌వ్యవస్థీకరించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పోలీసు పరిపాలనకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉంది. అప్పటి వరకు ఉనికిలో ఉన్న 9 పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లతో ఈ నోటిఫికేషన్‌ ఉంది. పోలీసు పాలనకు సంబంధించి కొత్త వ్యవస్థలో భాగంగా పోలీసు యూనిట్లు ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను అనుసరించి కొత్తగా పలు ప్రాదేశిక పోస్టులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది’ అని కేసీఆర్‌ తన వినతిపత్రంలో నివేదించారు.

40% అదనపు కేడర్‌ కేటాయించాలి..
‘రాష్ట్రానికి సంబంధించి కేంద్ర హోంశాఖ 2016లో ఐపీఎస్‌ కేడర్‌ను సమీక్షించింది. తెలంగాణకు మొత్తంగా 139 అధీకృత పోస్టులను ఆమోదించింది. ప్రస్తుతం పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లకు పోలీసు ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల కనీసం 29 సీనియర్‌ డ్యూటీ పోస్టులిస్తూ ప్రస్తుతమున్న 76 సీనియర్‌ డ్యూటీ పోస్టులను 105కు పెంచాలి. మొత్తంగా 139 మంది ఉన్న ఐపీఎస్‌ కేడర్‌ అధికారుల సంఖ్యను 195కి పెంచాలి. ఈ కేటాయింపుల వల్ల ఐపీఎస్‌లను విభిన్న ప్రాదేశిక యూనిట్లలో కమిషనర్లుగా, ఎస్పీలుగా, జోనల్‌ డీఐజీలుగా, మల్టీజోనల్‌ ఐజీలుగా నియమించే వీలుంటుంది.

అందువల్ల ప్రస్తుత ఐపీఎస్‌ కేడర్‌ సమీక్షను అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి’ అని సీఎం కేసీఆర్‌ వినతిపత్రంలో కోరారు. సాధారణంగా 5% అదనపు కేడర్‌ కేటాయింపునకు అనుమతి ఉంటుందని, ప్రస్తుత ప్రతిపాదన 40% అదనపు కేడర్‌ కేటాయింపులను అభ్యర్థిస్తోందని నివేదించారు. తెలంగాణతో పోల్చితే అదే స్థాయిలో జనాభా ఉన్న కేరళలో అధీకృత పోస్టుల సంఖ్య 172గా ఉందని, ఒడిశాలో 188గా ఉందని, కానీ తెలంగాణలో ప్రస్తుతం 139 పోస్టులు మాత్రమే ఉన్నాయని నివేదించారు.  

చదవండి: ‘భీమ్లా నాయక్‌’లో పాడిన ‘కిన్నెర’నాదుడు ఎవరో తెలుసా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top