Tamil Nadu: బిరియాని వండుకుని తింటూ.. డ్రగ్స్‌..

Tamil Nadu: Searches In 9 Central Jails Seized Cell Phones Arms - Sakshi

సెంట్రల్‌ జైళ్లలో మారణాయుధాలు 

ఏకకాలంలో తొమ్మిది జైళ్లలో తనిఖీలు

వెలుగు చూసిన వాస్తవాలు

ఖైదీల నుంచి మారణాయుధాలు, మాదకద్రవ్యాలు స్వాధీనం  

పేరుకే సెంట్రల్‌ జైళ్లు. అక్కడ ఖైదీలకు సకల సౌకర్యాలు అందుతున్నాయి. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం చెన్నై పుళల్‌ సహా రాష్ట్రంలోని తొమ్మిది సెంట్రల్‌ జైళ్లలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సెల్‌ఫోన్లతో పాటు మారణాయుధాలు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.  

సాక్షి ప్రతినిధి, చెన్నై : అడగాలేగాని జైళ్లలోని ఖైదీలకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా కొన్నేళ్ల క్రితం పుళల్‌ జైలులో ఖైదీలు బిరియాని వండుకుని తింటూ లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న వైనం ఫొటోలతో సహా బయటకు వచ్చింది. ఇటీవల తిరునెల్వేలి జైలులో ముత్తుమనో అనే ఖైదీ తోటి ఖైదీల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనతో జైళ్లలోకి మారణాయుధాలు ఎలా వచ్చాయనే అనుమానంతో అప్పట్లో తనిఖీలు చేపట్టగా మారణాయుధాలు, నిషేధిత మాదకద్రవ్యాలు దొరికాయి. ఆనాటి నుంచి అడపాదడపా అధికారులు జైళ్లను తనిఖీలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఏకకాలంలో రాష్ట్రంలోని 9 సెంట్రల్‌ జైళ్లను పోలీసు అధికారులు తనిఖీ చేపట్టారు. చెన్నై పుళల్‌ జైలులో విచారణ ఖైదీలు, శిక్ష పడిన ఖైదీలకు వేర్వేరుగా రెండు కేంద్ర కారాగారాలున్నాయి. అక్కడి ఖైదీలకు మారణాయుధాలు, నిషేధిత మాదకద్రవ్యాలు బయటి నుంచి సరఫరా అవుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది.

మాధవరం అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సుందరవదనం నేతృత్వంలో పది మంది ఇన్‌స్పెక్టర్లు సహా 150 మంది పోలీసులు రెండు జైళ్లలోకి ప్రవేశించి 8.30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. చెన్నై పుళల్‌ జైలులో నిషేధిత వస్తువులు దొరకలేదని ఏసీ సుందరవదనం తెలిపారు. కడలూరు, కోయంబత్తూరు, పాళయంగోట్టై, వేలూరు, సేలం, తిరునెల్వేలి, తిరుచ్చిరాపల్లి, మదురై సెంట్రల్‌ జైళ్లలో సైతం తనిఖీలు చేపట్టారు. కొన్ని జైళ్ల నుంచి సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.  

అన్నాడీఎంకే నేత ఇంట్లో ఏసీబీ తనిఖీలు 
రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన అన్నాడీఎంకేలో సీనియర్‌ నేత నాగనాథన్‌ (58) ఇంటిలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన 2011–16లో పోగలూరు యూనియన్‌ పంచాయతీ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రామనాథపురం జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శన మండపాలు, రోడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్ప డినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రామనాథపురం జిల్లా న్యాయమూర్తి అనుమతితో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం 7 గంటలకు నాగనాథన్‌ ఇంటిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రూ.15 లక్షల నగదు, ఆస్తిపత్రాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.  
      

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top