‘బిందాస్‌ బోల్‌’కార్యక్రమంపై సుప్రీంకోర్టు అభ్యంతరం

The Supreme Court Has Objected ON  Bindas Bol Program  - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ సర్వీసుల్లో ముస్లింలను చొప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రను బయటపెడుతున్నామంటూ సుదర్శన్‌ టీవీలో ప్రసారమవుతున్న బిందాస్‌ బోల్‌ కార్యక్రమంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఒక మతం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకునేలా మీడియాను అనుమతించవచ్చా అని ప్రశ్నించింది. ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం..‘ముస్లింలు సివిల్‌ సర్వీసెస్‌లో చేరడం ఒక పెద్ద కుట్రని మీరు చెప్పాలనుకుంటున్నారు. ఇలా విద్వేషాన్ని, విభేదాలను పెంచడం చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి ప్రచారంతో దేశం మనుగడ సాధించలేదు’ అని వ్యాఖ్యానించింది. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఏం జరిగిందో తమకు తెలుసునంది. ఎలక్ట్రానిక్‌ మీడియా స్వయం నియంత్రణను బలోపేతం చేసేందుకు సూచనలు ఇవ్వాలని కేంద్రం, నేషనల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ)లను కోరింది.

సుదర్శన్‌ టీవీ తరఫున ఆ చానల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సురేశ్‌ చవ్‌హంకే తన పిటిషన్‌లో.. బిందాస్‌ బోల్‌ కార్యక్రమంలో ‘యూపీఎస్‌సీ జిహాద్‌’ అనే మాట వాడటాన్ని సమర్థించుకున్నారు. యూపీఎస్‌సీ పరీక్ష రాసే ముస్లింలకు జకాత్‌ ఫౌండేషన్‌ అన్నివిధాలుగా సాయం అందిస్తోందనీ, ఈ ఫౌండేషన్‌కు ఉగ్ర లింకులున్న సంస్థల నుంచి నిధులందుతున్నాయని పేర్కొన్నారు. ఒకరిద్దరు అభ్యంతరం వ్యక్తం చేసినంతమాత్రాన కార్యక్రమంపై నిషేధం విధించడం తగదని తెలిపారు. అయితే, ఈ కార్యక్రమం ప్రొమోలో చూపిన దృశ్యాలపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. జకాత్‌ ఫౌండేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే వాదనలు వినిపించారు. జకాత్‌ ఫౌండేషన్‌ ముస్లింలతోపాటు ముస్లిమేతరులకు కూడా సాయం చేస్తోందన్నారు. కాగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు బిందాస్‌ బోల్‌ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ ఈ నెల 15వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులపై సుదర్శన్‌ టీవీ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ వేసింది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఆగిపోయిందీ కోట్లాదిమంది తెలుసుకోవాలని భావిస్తున్నందున విచారణ ప్రక్రియను లైవ్‌లో చూపేందుకు చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కోరింది. వాక్‌ స్వాతంత్య్రానికి సంబంధించి ఇది చాలా కీలకమైన కేసని పేర్కొంది.      

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top