ఎన్నికల సంఘానికి ఊరట.. అలా ఆదేశించలేమన్న సుప్రీం | Sakshi
Sakshi News home page

ఎన్నికల సంఘానికి ఊరట.. అలా ఆదేశించలేమన్న సుప్రీం

Published Fri, May 24 2024 2:35 PM

Supreme Court Adjourns Voter Turnout Data Plea Relief To EC

న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఊరట లభించింది. ఓటర్‌ ఓటింగ్‌ డేటా విడుదల విషయంలో దాఖలైన పిటిషన్ల విచారణను ఎన్నికలు ముగిసేవరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఐదు దశల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని స్పష్టం చేసింది.  

లోక్‌సభ ఎన్నికల వేళ ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.  జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ దీనిపై విచారణ జరిపింది.

అయితే.. పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్‌ విచారణ చేస్తుందని వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

ప్రతి దశలో పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా బూత్‌ల వారీగా ఓటింగ్‌ శాతాలను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని కోరుతూ ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం’(అఈఖ) సుప్రీం కోర్టులో ఇటీవల మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది. అయి దీనిపై 2019లోనే ఓ పిటిషన్‌ను దాఖలు అయ్యింది. అయితే తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం.. వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17నే ఈసీని ఆదేశించింది.

అయితే.. పిటిషన్‌దారు చేసిన డిమాండును వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది. మరోవైపు ఇదే అంశంపై 2019లోనూ టీఎంసీ నేత మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌ను ఏడీఆర్‌ పిటిషన్‌తో జతపర్చి విచారణ జరపనుంది సర్వోన్నత న్యాయస్థానం. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement