బాండ్ల జారీపై ఎస్‌బీఐ కన్ను | Sakshi
Sakshi News home page

బాండ్ల జారీపై ఎస్‌బీఐ కన్ను

Published Thu, Dec 15 2022 5:52 AM

State Bank Of India To Raise Rs 10,000 Crore Through Tier I Bonds - Sakshi

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) బాండ్ల జారీకి సిద్ధపడుతోంది. టైర్‌–1 బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు బ్యాంకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. అదనపు టైర్‌–1(ఏటీ–1) బాండ్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లవరకూ సమకూర్చుకునే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పేర్కొంది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందవలసి ఉన్నట్లు తెలియజేసింది.

బాసెల్‌–3 నిబంధనలకు అనుగుణమైన రుణ సెక్యూరిటీల జారీ ద్వారా  2024వరకూ నిధుల సమీకరణపై సెంట్రల్‌ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఎస్‌బీఐ వివరించింది. నిధులను లోన్‌ బుక్‌ వృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొంది. అధిక విలువగల గృహ రుణాలు మినహా వ్యక్తిగత బ్యాంకింగ్‌ అడ్వాన్సులు రూ. 5 లక్షల కోట్లను దాటినట్లు గత వారమే ఎస్‌బీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. చివరి రూ. లక్ష కోట్ల రుణాల మంజూరీకి ఏడాది కాలంపట్టగా.. అంతకుముందు 15 నెలల్లో ఈ ఫీట్‌ సాధించినట్లు తెలియజేసింది. దీనికంటే ముందు రూ. లక్ష కోట్ల రుణ విడుదలకు 30 నెలలు పట్టడం గమనార్హం!  

ఈ వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.4 శాతం బలపడి రూ. 625 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 627 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది! 

Advertisement

తప్పక చదవండి

Advertisement