
సాక్షి, న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి పూర్తి డేటా సమర్పించనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. కాగా తాము అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా భారత్ బయోటెక్ అనుమతి కోరిన విషయం తెలిసిందే. అదే విధంగా పూణె కేంద్రంగా పనిచేసే సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా ఇదే తరహా ప్రతిపాదనలు చేసింది. ఈ విషయంపై స్పందించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టీకా భద్రత అంశం గురించి మరింత డేటా అందజేయాలని ఆదేశించింది.(చదవండి: జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!)
ఇదిలా ఉండగా.. మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు డిసెంబర్ 2న బ్రిటన్ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్ కూడా సన్నాహాలు చేస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 సెల్సియస్ డిగ్రీల వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కార్గో విమానంలో, విమానాశ్రయంలో, అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు తగిన శీతల కంటేనర్లను, వాటిలో వచ్చే ఫైజర్ వ్యాక్సిన్ డోసులను నిల్వచేసే శీతల ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లు చకా చకా జరగిపోతున్నాయి.