జనం గుండెల్లో కట్టబొమ్మన్‌ ముద్ర

Sagili Sudharani Praises Kattabomman - Sakshi

కొరుక్కుపేట: 200 ఏళ్లు దాటినా.. జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వీరపాండ్య కట్టబొమ్మన్‌ తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని హైదరాబాద్‌ చెందిన రచయిత్రి డాక్టర్‌ సగిలి సుధారాణి వ్యాఖ్యానించారు. ఈ మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఆధ్వర్యంలో నెలనెలా వెన్నెల నెట్‌ ఇంట్లో  కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. దక్షిణాది తెలుగు సంస్థానాలు అనే అంశంపై రచయిత్రి డాక్టర్‌ సగిలి సుధారాణి వక్తగా పాల్గొని ప్రసంగించారు. దక్షిణాది తెలుగు సంస్థానాలు పాలించిన చోట నాటి రాజభవనాలు చాలావరకు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, ముఖ్యంగా చాళుక్య, చోళ, శాతవాహనులు, విజయనగరరాజుల ప్రతినిధులుగా సామంతులు, నాయకరాజులు ఇప్పటి తమిళప్రాంతాన్ని ఏలారని తెలిపారు. వీరి ప్రభావం సింహళానికి విస్తరించిందని చెప్పారు. ఆంగ్లేయులకాలంలో భారతదేశంలో వ్యాపారానికి వచ్చి, మనదేశాన్నే ఆక్రమించుకొని, మనవారిపైనే పన్నులు విధించారు.

ఆ సమయంలో బ్రిటీష్‌ వారిపై దేశంలో అనేక చోట్ల తిరుగుబాట్లు జరిగాయన్నారు. భారతదేశ తొట్టతొలి స్వాతంత్య్ర సమర యోధురాలు రాణి వేలు నాచ్చియార్‌’, ఈమె రామనాథపురం కోటకు యువరాణి, శివగంగ సీమకు రారాణి అని తెలిపారు. అలాగే తొలి స్వాతంత్య్ర సమరయోధుడు (1755-1801) కట్టబొమ్మన్‌ తెలుగువాడు కావడం గొప్ప విషయం అన్నారు. వీరి వంశం పోరాటానికి పెట్టింది పేరని, కట్టబొమ్మన పూర్వులు పరాయి పాలనను ఎదురొడ్డి నిలిచారన్నారు. భవిష్యత్తు తరాల వారికి ఈ స్ఫూర్తిని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. 200 ఏళ్ల క్రితం ఉరితీయబడ్డా.. జనం గుండెల్లో చిరంజీవిగా ఉన్న కట్టబొమ్మన్నకు సమున్నత గౌరవ స్థానాన్ని తమిళనాడు ప్రభుత్వం అందించి, ఆ మహనీయునికి స్మృతిచిహ్నంగా స్థూపాన్ని కైయత్తార్‌ ప్రతిష్టించిందన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top