7 వసంతాల తర్వాత ఎట్టకేలకు.. | Rare Himalayan brown bear spotted in Kinnaur | Sakshi
Sakshi News home page

7 వసంతాల తర్వాత ఎట్టకేలకు..

May 17 2026 4:52 AM | Updated on May 17 2026 4:52 AM

Rare Himalayan brown bear spotted in Kinnaur

 హిమాలయసానువుల్లో ప్రత్యక్షమైన గోధుమవర్ణ భల్లూకం

జీవవైవిధ్యం కొనసాగడంపై జీవావరణవేత్తల్లో వెల్లువెత్తిన హర్షాతిరేకాలు

సిమ్లా: మారుతున్న వాతావరణ పరిస్థితులు హిమశిఖరాల్లోని టన్నుల కొద్దీ మంచును కబళించివేస్తున్నాయి. దీంతో మంచుతో నిండిపోయి సుందరంగా కన్పించాల్సిన హిమాలయాలు చాలా చోట్ల మట్టిదిబ్బలుగా దర్శనమిస్తు న్నాయి. మంచులో కలియతిరిగే భల్లూకాలు సైతం అంతర్థానమవుతున్నాయి. మరీముఖ్యంగా గోధమవర్ణ ఎలుగుబంట్లను హిమాచల్‌ వాసులు చూసి ఏడు వసంతాలు గడిచిపో యాయి. అయితే తాజాగా కినౌర్‌ జిల్లాలో మళ్లీ బ్రౌన్‌ బేర్‌ దర్శనమిచ్చి సందడిచేసింది.

 కినౌర్‌లోని మంచు లోయల్లో తన రెండు బుల్లి భల్లూకాలతో కన్పించి సందడిచేసిన ఆడ ఎలుగుబంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాక్చమ్‌– చిట్కుల్‌ వన్యప్రాణి సంరక్షణా అరణ్యంలో ఏడేళ్ల తర్వాత గత వారం ఒక గోధమరంగు ఎలుగుబంటిని చూశామని హిమాచల్‌ ప్రదేశ్‌ అటవీశాఖ విభాగం ఒక వీడియోను విడుదల చేసింది. బ్లాక్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సంతోష్‌ ఠాకూర్, ప్రకృతి ప్రేమికుడు గారీ భట్టీ, పరిశోధకులు డాక్టర్‌ బిశ్వరూప్‌ సత్పతి, డాక్టర్‌ రాహుల్‌దేవ్‌ మండల్‌ స్వయంగా వెళ్లి ఎలుగును చూసి వచ్చారు. 

బర్డ్‌కౌంట్‌ 2026 కార్యక్రమంలో చేపడుతుండగా అనూహ్యంగా ఇది కంటపడింది. ‘‘ఈ హిమాలయన్‌ బ్రౌన్‌ బేర్‌ అనేది గోధమరంగు భల్లూకాల్లో ఉపజాతికి చెందినది. దీని ఉర్సుస్‌ ఆర్కటస్‌ ఇసాబెల్లినస్‌ అని కూడా అంటారు. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సముద్రమట్టానికి 2,5000 అడుగుల ఎత్తులో మంచుమయ వాతా వరణాల్లో మాత్రమే ఇవి జీవిస్తాయి. గరిష్టంగా 250 కిలోలవరకు పెరుగుతాయి.

 సమూహంగాకాకుండా ఒంటరిగా జీవిస్తాయి. చెట్ల ఆకులు, వేర్లు, ఫలాలు, గడ్డి తిని బతుకు తాయి. ఇప్పటికే దీనిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. కాలుష్యం, తగ్గిన మంచు, తదితర కారణాలతో వీటి సంతతి భారీగా తగ్గిపోయింది. ‘‘కాలుష్యభూతానికి హిమాలయాలు బలవుతున్నా ఇంకా ఇలాంటి జాతులను కాపాడుతూ భావితరాలకు మన దేశ జీవవైవిధ్యాన్ని చాటేందుకు కృషి చేస్తున్నాయి’’ అని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి, హిమాచల్‌లో డెప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (వైల్డ్‌లైఫ్‌) అశోక్‌ నేగీ వ్యాఖ్యానించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement