టీవీకే నేత కామెంట్లు.. రజినీకాంత్ రెస్పాన్స్‌ అదుర్స్‌​ | Rajinikanth Reacts To TVK Leader's Remarks On Him | Sakshi
Sakshi News home page

టీవీకే నేత కామెంట్లు.. రజినీకాంత్ రెస్పాన్స్‌ అదుర్స్‌​

Mar 17 2026 4:44 PM | Updated on Mar 17 2026 5:31 PM

 Rajinikanth Reacts To TVK Leader's Remarks On Him

చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్‌ రజినీకాంత్‌పై టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున పలు కామెంట్లు చేయడంపై తమిళనాడులో రాజకీయ వివాదం మొదలైంది. తాజాగా, ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. డీఎంకేలో అత్యధిక ప్రభావం చూపిస్తున్న కుటుంబ బెదిరింపుల వల్ల రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా మానుకున్నారని అన్నారు. అర్జున ఈ వ్యాఖ్యను తమ నాయకుడు విజయ్ మానసికంగా ఎంతగా బలంగా ఉన్నారో చెప్పడానికి చేశారు. విజయ్‌ ఏ బెదిరింపులకు లొంగలేదని చెప్పాలన్న ఉద్దేశంతో అన్నారు.  అర్జున చేసిన ఈ కామెంట్‌ వివాదానికి దారితీసింది. అన్ని పార్టీల నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి.

దీనిపై రజినీకాంత్‌ స్పందించారు. అన్ని పార్టీల నాయకులు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. అర్జున చేసిన కామెంట‍్లలో నిజం లేదని పేర్కొంటూ  తమిళంలో ఓ ప్రకటన చేశారు. "సమయం ఇప్పుడు సమాధానం చెప్పకపోవచ్చు.. చివరికి నిజాన్ని బయటపెడుతుంది. సరైన సమాధానం ఇస్తుంది" అని అందులో అన్నారు.

కాగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందిస్తూ ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. ‘రజినీకాంత్ రాజకీయాలకు అతీతంగా ఉంటారు. ఆయనను అందరూ గౌరవిస్తారు. ఆయన కీర్తిని దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదు. రాజకీయాల్లోకి వచ్చే హక్కు, అలాగే, దానికి దూరంగా ఉండే హక్కు అందరికీ ఉంటుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మర్యాద అనిపించుకోదు" అని ఎక్స్‌లో చెప్పారు.

రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై దశాబ్దాలుగా ఊహాగానాలు కొనసాగాయి. 2020లో ఆయన ఆరోగ్య సమస్యలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజకీయాల్లోకి రావద్దని నిర్ణయం తీసుకున్నారు. టీవీకే నాయకుడి వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఎస్ రెగుపతి కూడా విమర్శలు గుప్పించారు. అర్జున చేసిన వ్యాఖ్యలు అసత్యాలని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా టీవీకే రాజకీయ లాభం పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు.

కాగా, తమిళనాడులో రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌ ఇప్పటివరకు పొత్తుల గురించి ప్రకటన చేయలేదు. ఎన్డీఏతో కలిసి టీవీకే పోటీ చేస్తుందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, దాన్ని టీవీకే కొట్టివేసింది. సినీరంగం నుంచి గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటివారు వచ్చి సక్సెస్‌ అయ్యారు. కమల్ హాసన్ వంటి వారు అంతగా రాణించలేదు. మరికొందరు సినీనటులు రజినీకాంత్‌లా రాజకీయాలకు దూరంగా నిలిచారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement