రైల్వే శాఖ కీలక నిర్ణయం

Railways To End Khalasi System Says No To New Appointments - Sakshi

ఖలాసీ వ్యవస్థకు ముగింపు!

న్యూఢిల్లీ: వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలిఫోన్‌ అటెండెంట్‌ కమ్‌ డాక్‌ ఖలాసీల(టీఏడీకే)కు సంబంధించిన నియామక ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు పేర్కొంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా జూలై 1, 2020 నాటికి చేపట్టిన నియామకాలను రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని రైల్వే సంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.(రైల్వే సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్‌) 

కాగా టీఏడీకే గ్రూప్‌ డీ కేటగిరీ ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే. సీనియర్‌ రైల్వే అధికారుల నివాసాల వద్ద వీరు విధులు నిర్వర్తిస్తారు. ఫోన్‌ కాల్స్‌ అటెండ్‌ చేయడం, ఫైల్స్‌ అందించడం వంటి పనుల చేస్తారు. అయితే చాలా మంది అధికారులు టీఏడీకేలను తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లుతుతున్న విషయం తెలిసిందే. ఇక వివిధ విభాగాల్లో కాలానుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రైల్వే శాఖ.. ఇప్పటికే డాక్‌ మెసేంజర్‌ వ్యవస్థకు చరమగీతం పాడిన విషయం తెలిసిందే.

దీనికి బదులుగా వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా మెయిల్స్‌ ద్వారా సమాచారం చేరవేయాలని అధికారులకు సూచించింది. కాగా రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top