Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో... నెలకో పాదయాత్ర

Rahul Gandhi advice to party leaders about Bharat Jodo Yatra - Sakshi

హరియాణాలో జోడో యాత్రలో రాహుల్‌

నూహ్‌ (హరియాణా):  ‘‘కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న పోరాటం కొత్తదేమీ కాదు. రెండు భిన్న భావజాలాల మధ్య వేలాది ఏళ్లుగా జరుగుతూ వస్తున్నదే. ప్రజల గొంతుకగా నిలవడమే కాంగ్రెస్‌ సిద్ధాంతం. కొద్దిమంది పెద్దలకు మాత్రమే సర్వం దోచిపెట్టడం బీజేపీ సిద్ధాంతం’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన భారత్‌ జోడో యాత్ర బుధవారం రాజస్తాన్‌ నుంచి హరియాణాలోకి ప్రవేశించింది. పలువురు మాజీ సైనికులు తదితరులు ఆయన వెంట నడిచారు. ఈ సందర్భంగా అతి శీతల వాతావరణంలోనూ భారీ సంఖ్యలో గుమిగూడిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘ఏసీల్లో కూర్చుని, కార్లలో తిరిగితే అర్థం కాని ఎన్నో విషయాలను యాత్ర ద్వారా తెలుసుకుంటున్నా. మన దేశంలో రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య భారీ అగాథముంది. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుంది. ప్రజల గొంతు వినే అవసరం లేదన్నది నాయకుల అభిప్రాయం. అందుకే గంటల కొద్దీ ప్రసంగాలిస్తుంటారు. దాన్ని మార్చేందుకు నేను ప్రయత్నిస్తున్నా. రోజూ ఆరేడు గంటలు నడుస్తున్నా. ఈ సందర్భంగా రైతులు, కార్మికులు, యువత, చిరుద్యోగుల వంటి అన్ని వర్గాల వారి అభిప్రాయాలు వింటూ సాగుతున్నాం. చివర్లో చాలా క్లుప్తంగా మాత్రమే మేం మాట్లాడుతున్నాం’’ అని చెప్పారు. ఇకపై ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో కనీసం నెలకో రోజు నేతలు పాదయాత్ర చేయాలని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచిస్తానన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top