సైనిక దుస్తుల్లో సగర్వంగా.. మనసుల్ని  కదిలించిన  ఆ సెల్యూట్‌ 

Pulwama martyr Major Dhoundiyal Wife Nitika Kaul Joins Indian Army - Sakshi

విధి నిర్వహణలో అమరుడైన మేజర్‌ విభూతి 

భర్త ఆశయాలు కొనసాగించాలని నితికా కౌల్‌ నిర్ణయం 

ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఎంపిక 

లెఫ్టినెంట్‌గా సైన్యంలో చేరిన ధీర వనిత

జమ్మూ: చూడముచ్చటైన జంట. పెళ్లయి తొమ్మిది నెలలే అయింది. ఎన్నెన్నో కలలు. భవిష్యత్తుపై కలబోసుకున్న ఊసులు, ఆశలు. అది 2019 ఫిబ్రవరి 14. నితికా కౌల్‌ కాళ్ల కింద భూమి కంపించింది. భర్త... మేజర్‌ విభూతి శంకర్‌ ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడయ్యారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా జీవితం తల్లకిందులైపోతుంది. నిరాశానిస్పృహల్లో కూరుకుపోతారు. కాని నితికా కౌల్‌ వేరు. మనసులో దృఢ సంకల్పం.. సుస్పష్టమైన లక్ష్యం. దేశసేవలో అమరుడైన భర్త ఆశయాన్ని బతికిస్తూ... తానూ సైన్యంలో చేరాలి. అంతే శ్రమించింది... సాధించింది. దేశం గర్వపడేలా శనివారం లెఫ్టినెంట్‌ హోదాలో భారత సైన్యం అడుగుపెట్టింది. ఈ ధీశాలి మనోనిబ్బరానికి... అంతకుమించి ఆమె కర్తవ్యదీక్షకు దేశం సలాం కొడుతోంది. స్ఫూర్తిమంతమైన ఆమె విజయానికి ప్రశంసలు కురిపిస్తోంది.  విధి నిర్వహణలో భర్త ప్రాణాలు కోల్పోయాక సరిగ్గా 27 నెలల తర్వాత నితికా కౌల్‌ సైతం భారత సైన్యంలో చేరడం గమనార్హం.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జైషే మొహమ్మద్‌ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు బలైన సంగతి తెలిసిందే. దేశంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు. ఆర్మీ, పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. పుల్వామా దాడి స్థలానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలోనే ఫిబ్రవరి 18న ఎన్‌కౌంటర్‌ జరిగింది. ముగ్గురు జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి వెనకున్న ఇద్దరు అగ్రనేతలు ఇందులో ఉన్నారు. ఐదుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. వీరిలో 55 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ కూడా ఉన్నారు. డెహ్రాడూన్‌కు చెందిన ఆయనకు అప్పటికి కేవలం 9 నెలల ముందే కశ్మీర్‌ వాసి నితికా కౌల్‌తో వివాహం జరిగింది. వారిది ప్రేమ వివాహం. మరో మూడు నెలల్లో వివాహ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటుండగా మాతృభూమి సేవలో దౌండియాల్‌ ప్రాణాలు అర్పించారు. విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మేజర్‌ దౌండియాల్‌కు భారత ప్రభుత్వం శౌర్యశక్ర పురస్కారం (మరణానంతరం) ప్రకటించింది. 

సంకల్ప బలంతో... 
భర్త దూరమైనప్పటికీ నితికా కౌల్‌ ధైర్యం కోల్పోలేదు. ఆయన ఆశయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు సైన్యంలో చేరడమే మార్గమని నిశ్చయించుకున్నారు. ఢిల్లీలోని ఓ బహుళ జాతి సంస్థలో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. పట్టుదలతో కష్టపడి చదివారు. గత ఏడాది షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలో, అనంతరం ఇంటర్వ్యూలో నెగ్గారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఓటీఏ)లో ఏడాదిపాటు విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. లెఫ్టినెంట్‌ హోదాలో శనివారం సగర్వంగా సైన్యంలో అడుగుపెట్టారు. 

మనసుల్ని  కదిలించిన  ఆ సెల్యూట్‌ 
మేజర్‌ శంకర్‌ దౌండియాల్‌ అంత్యక్రియల సందర్భంగా ఆయన భార్య ప్రదర్శించిన మనోనిబ్బరం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వస్థలం డెహ్రాడూన్‌లో దౌండియాల్‌ అంత్యక్రియలు జరిగాయి. సంబంధిత వీడియో దృశ్యాలు అప్పట్లో  వైరల్‌గా మారాయి. నితికా తన భర్తకు కన్నీటి వీడ్కోలు పలికారు. గాలిలో ముద్దు (ఫ్లయింగ్‌ కిస్‌) ఇచ్చి, ‘లవ్‌ యూ... విభూ’ అంటూ భర్త పార్థివదేహానికి సెల్యూట్‌ చేయడం ప్రజల మనస్సులను కదిలించింది.

నా భర్తకు మరింత చేరువయ్యా..
‘‘సైన్యంలో చేరడం ద్వారా నా భర్తకు మరింత చేరువగా ఉన్నట్లు అనుభూతి చెందుతున్నా. సైన్యంలో అడుగుపెట్టడం నా భర్తకు నిజమైన నివాళి అని భావిస్తున్నా. మేజర్‌ దౌండియాల్‌ మరణంతో నా జీవితం తొలుత శూన్యంగా మారినట్లు తోచింది. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. సన్నిహితులు దూరమైతే మనోవేదన కలగడం సహజమే. అయినప్పటికీ వాస్తవ పరిస్థితిని అంగీకరించాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. సైనికుడిగా పోరాడుతూ ప్రాణాలు అర్పించిన భర్త ఆశయాలను కొనసాగించాలంటే సైన్యంలో చేరడం మంచిదని నిర్ణయానికొచ్చా. భర్త మరణించాక 15 రోజులకు ఢిల్లీలో మళ్లీ ఉద్యోగంలో చేరా. మళ్లీ నా కాళ్లపై నేను నిలబడడానికి, బాధను మరచిపోవడానికి కొంతకాలం పనిచేసి, రాజీనామా సమర్పించా. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా. దరఖాస్తును పూర్తి చేయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. భర్త అడుగు జాడల్లోనే నడిచే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’’ 
– లెఫ్టినెంట్‌ నితికా కౌల్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top