14న పీఎస్‌ఎల్‌వీ–సీ52 ప్రయోగం

PSLV-C52 launch on 14th Feb - Sakshi

సన్నాహాలు పూర్తిచేస్తున్న శాస్త్రవేత్తలు

13న ఉ.4.29 నుంచి కౌంట్‌డౌన్‌

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ–సీ52 రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి 25.30 గంటల ముందు అంటే ఈ నెల 13 తెల్లవారు జామున 4.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు బుధవారం ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో భాగంగా షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికకు సంబంధించిన వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో నాలుగు దశల రాకెట్‌ అనుసంధానాన్ని పూర్తిచేసి బుధవారం ఉదయం వ్యాబ్‌ నుంచి హుంబ్లికల్‌ టవర్‌కు తరలించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌ను ప్రయోగ వేదికకు అనుసంధానం చేసి నాలుగు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు.

ఈ ప్రయోగంలో 1,710 కిలోల బరువున్న రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌(ఈఓఎస్‌–04) ఉపగ్రహంతో పాటు మరో రెండు చిన్న ఉప గ్రహాలను కూడా రోదసీలోకి పంపుతున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) వారు రూపొందించిన ఇన్‌స్పైర్‌ శాట్‌–1, ఇండియా–భూటాన్‌ సంయుక్తంగా తయారు చేసిన ఐఎన్‌ఎస్‌–2బీ ఉపగ్రహాలనూ రోదసీలోకి పంపనున్నారు. అయితే ఇందులో ప్రధానంగా రాడార్‌ ఇమేజింగ్‌ శాటిలైట్‌ను భూమికి 529 కి.మీ ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహ ప్రయోగం.. వాతావరణ పరిశోధన, వ్యవసాయం, అటవీశాఖ, వరదలు, విపత్తుల పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఈ నెల 12న మిషన్‌ రెడీనెస్‌ సమీక్ష నిర్వహిస్తారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top