Predator Drone Deal: అమెరికా నుంచి అత్యాధునిక డ్రోన్లు

Predator drone deal: India in advanced stage of talks with US for procuring MQ-9B Drons - Sakshi

ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం చర్చలు 

రక్షణ శాఖ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: అమెరికా నుంచి అత్యాధునిక ఎంక్యూ–9బీ ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన సంప్రదింపులు పురోగతిలో ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 30 ఎంక్యూ–9బీ డ్రోన్లు అందితే వీటిని చైనా సరిహద్దులతోపాటు హిందూమహా సముద్రం ప్రాంతంపై నిఘాకు వినియోగించనున్నట్లు వెల్లడించాయి. ఎంక్యూ–9 రీపర్‌ డ్రోన్‌ ఆధునిక వెర్షనే ఎంక్యూ–9బీ. గత నెలలో అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోని ఓ ఇంట్లో ఉన్న అల్‌ఖైదా నేత అల్‌ జవహరిని హతమార్చేందుకు వాడింది ఎంక్యూ–9 రీపర్‌ డ్రోన్‌నే కావడం గమనార్హం. జనరల్‌ ఆటమిక్స్‌ అభివృద్ధి చేసిన ఎంక్యూ–9 బీ ప్రిడేటర్ల కోసం రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయన్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు తోసిపుచ్చాయి.

ప్రస్తుతం చర్చలు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశాయి. వీటి ఖరీదు,, ఆయుధాల ప్యాకేజీ, సాంకేతికత భాగస్వామ్యానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలు నడుస్తున్నాయని తెలిపాయి. ఇదే విషయాన్ని జనరల్‌ ఆటమిక్స్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ వివేక్‌ లాల్‌ కూడా ధ్రువీకరించారు. చర్చల వివరాలను రెండు దేశాల ప్రభుత్వాలే వెల్లడిస్తాయన్నారు. ఎంక్యూ–9బీ గార్డియన్‌ రకం రెండు డ్రోన్లను 2020 నుంచి భారత్‌ తమ నుంచి లీజుకు తీసుకుని భూ సరిహద్దులు, హిందూ మహాసముద్రంపై నిఘాకు వినియోగిస్తోందన్నారు. ఈ హంటర్‌–కిల్లర్‌ డ్రోన్లు 450 కిలోల బరువైన బాంబులతోపాటు నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులను మోసుకెళ్లగలవు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top