భారీ 'ఉగ్ర కుట్ర' భగ్నం | Police teams Broken terrorists module in 3 states of India | Sakshi
Sakshi News home page

భారీ 'ఉగ్ర కుట్ర' భగ్నం

Nov 11 2025 1:41 AM | Updated on Nov 11 2025 1:41 AM

Police teams Broken terrorists module in 3 states of India

సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో పేలుడు చోటుచేసుకున్న ప్రదేశంలో సహాయక చర్యలు

వైద్యుల ముసుగులో విధ్వంస రచన... వైట్‌ కాలర్‌ ఉగ్ర నెట్‌వర్క్‌ గుట్టురట్టు

ఒకే చోట 2,913 కేజీల పేలుడు పదార్థాలు స్వాదీనం 

ముగ్గురు వైద్యులుసహా ఎనిమిది మంది అరెస్ట్‌... వైద్యరంగంలోని వ్యక్తులపైనా ఉగ్రభావజాలాన్ని రద్దుతున్న ముష్కరులు 

నిషేధిత జైషేమొహమ్మద్, అన్సార్‌ ఘజ్‌వాత్‌–ఉల్‌–హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధాలు 

3 రాష్ట్రాల ఉగ్రమాడ్యూల్‌ను చేధించిన పోలీసుల బృందం  

న్యూఢిల్లీ: హస్తినలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. లాల్‌ ఖిలా మెట్రోస్టేషన్‌ ఒకటో నంబర్‌ గేటు సమీపంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడటంతో ఆగిన హ్యుందాయ్‌ ఐ20 కారులో జరిగిన భారీ పేలుడు ధాటికి కారులోని ముగ్గురు సహా మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పక్కన ఉన్న ఆరు కార్లు, రెండు ఇ–రిక్షాలు, ఆటోలు సైతం తీవ్రస్థాయిలో ధ్వంసమయ్యాయి. దీంతో మరో 20  మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన సమీపంలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 

పేలుడు ధాటికి సమీప మార్కెట్‌లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 

ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పేలుడు ఘటనతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట, పార్లమెంట్, మెట్రో స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. జనసమ్మర్ధ ప్రాంతాల్లో సోదాలను పెంచారు. 

లాడ్జ్‌లలోనూ తనిఖీలు చేపట్టారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఢిల్లీ పోలీస్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ), ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఆధారాలను ఫోరెన్సిక్‌ బృందాలు సేకరిస్తున్నాయి. ఘటన జరిగిన తీరును అక్కడి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెల్సుకుంటున్నారు పేలుడు తర్వాత మంటలు, దట్టమైన పొగ అలుముకున్న ఆ ప్రాంతంలో మంటలను రాత్రి ఏడున్నరకల్లా ఆర్పేశామని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. అయితే ఇది ఉగ్రదాడి అని వార్తలొస్తున్నా ఇప్పటిదాకా ఏ ఉగ్రసంస్థా ఈ పేలుడుకు బాధ్యలము తామేనని ప్రకటించుకోలేదు.  

ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద పేలుడు 
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సరిగ్గా సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు లాల్‌ఖిలా మెట్రోస్టేషన్‌ ఎదురుగా ఉన్న సుభాష్‌ మార్గ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఎర్రలైట్‌ పడటంతో కొన్ని వాహనాలు ఆగాయి. అదే సమయంలో ఐ20 మోడల్‌ కారు వెనుకభాగం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఛాందిని చౌక్‌ మార్కెట్‌లోని జనం భయంతో పరుగులు తీశారు. 

పేలుడు ధాటికి సమీప వాహనాలు సైతం మంటల్లో కాలిపోయాయని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సతీశ్‌ గోల్చా మీడియాతో చెప్పారు. ఘటనపై మంత్రి అమిత్‌ షాతో మాట్లాడారు. ఘటన వివరాలను ప్రధాని మోదీ అమిత్‌షాను అడిగి తెల్సుకున్నారు. ఛాందిని చౌక్‌ మార్కెట్‌ సమీపంలోనే పేలుడు సంభవించడంతో జనం రద్దీని కట్టడిచేసేందుకు మంగళవారం మార్కెట్‌ను మూసేస్తున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు సంజయ్‌ భార్గవ చెప్పారు. 

కశ్మీర్‌ వాసి పేరిట కారు రిజిస్ట్రేషన్‌ ! 
పేలిన కారు హరియాణాలో హెచ్‌ఆర్‌26సీఈ 7674 నంబర్‌తో రిజిస్ట్రర్‌ అయినట్లు గుర్తించారు. కారు యజమాని నదీం ఖాన్‌ను గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ఈ కారు పలువురు యజమానులు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే చివరిసారిగా కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన తారిఖ్‌ అనే వ్యక్తి దీనిని కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. 

అయితే కారు క్రయ, విక్రయల సమయాల్లో తప్పుడు గుర్తింపు పత్రాలు, డాక్యుమెంట్లను వినియోగించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే 2013 మోడల్‌ ఐ20 తెలుపు రంగు కారుకు గతంలో యజమాలుగా ఉన్న ఎండీ సల్మాన్, దేవేందర్‌లనూ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గురుగ్రామ్‌లోని శాంతినగర్‌కు చెంది సల్మాన్‌ ఈ కారును ఏడాదిన్నర క్రితం ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతానికి చెందిన దేవేందర్‌కు విక్రయించాడు. తర్వాత ఈ కారును అంబాలా నగరంలో మరొకరు కొన్నారు. 

మృతదేహాల్లో కానరని బాంబు శకలాలు 
పేలిన కారులో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు, గాయపడిన శరీరభాగాల్లోకి ఎలాంటి మేకులు, చిన్నపాటి ఇనుపగుండ్లు దూసుకెళ్లలేదు. ఉగ్రవాదులు ఉపయోగించే ఐఈడీ తరహా పేలుడుపదార్థంలో ఇలాంటి వాటిని చొప్పించి పేలుడు విస్తృతి ఎక్కువగా ఉండేలా, పెద్దసంఖ్యలో జనం మరణించేలా కుట్ర పన్నుతారు. కానీ ఈ ఘటనలో ఎలాంటి మేకులు, బాల్‌ బేరింగ్‌లు, చిన్న వైర్ల జాడ కనిపించలేదు. కానీ ఘటనాస్థలిలో ఒక బుల్లెట్‌ను కనుగొన్నారు. 

రసాయన పదార్థంకారణంగా సంభవించే కాలిన గాయాలు సైతం మృతదేహాలపై లేవు. దీంతో ఏ తరహా పదార్థం పేలిందనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఢిల్లీ నేర విభాగం, ప్రత్యేక విభాగం, జాతీయ దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు వేర్వేరు కోణాల్లో దర్యాప్తును ముమ్మరంచేశాయి. పేలిన కారు అంతకుముందు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను చెక్‌ చేస్తున్నారు. ఘటనాస్థలిలో ఘటన జరిగినప్పుడు అక్కడ క్రియాశీలకంగా ఉన్న మొబైళ్ల తాజా లొకేషన్లనూ సరిచూస్తున్నారు. 

రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సమీపం నుంచే బాంబును పేల్చి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కొన్ని సెకన్ల ముందు ఒకవేళ అక్కడి పాదచారులు సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకుంటే వాటిని తమకు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పోలీసు విభాగం పౌరులను కోరింది. ఈ పేలుడు అధిక–ఉష్ణోగ్రతను వెదజ్లే విస్ఫోటనం కాకుండా యాంత్రిక లేదా రసాయనిక విస్ఫోటనం అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే నైట్రేట్లు లేదా టీఎన్‌టీ వంటి జాడను వెతుకుతున్నారు.  

ఆస్పత్రులకు పోటెత్తిన బాధితుల కుటుంబసభ్యులు 
పేలుడు ఘటనలో తమ వారు ప్రాణాలు కోల్పోయారన్న వార్త తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు హుటాహుటిన మార్చురీలు, ఆస్పత్రులకు చేరుకుని దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. క్షతగాత్రుల కుటుంబసభ్యులు, స్థానికులు, మీడియా ప్రతినిధులతో ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది. తమ వారిని ఐసీయూలో చేర్పించారని, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏ విషయాలు చెప్పట్లేరని పలువురు కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన వ్యక్తంచేశారు. 

కేంద్రహోం మంత్రి అమిత్‌ షా సైతం లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రుల ఆరోగ్యంపై వాకబు చేశారు. స్వల్ప గాయాలైన క్షతగాత్రులను ఓదార్చారు. ఘటన జరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. తర్వాత ఘటనాస్థలికి రాత్రి పదిన్నర ప్రాంతంలో అమిత్‌ షా చేరుకున్నారు. పేలుడు జరిగిన తీరును అక్కడి దర్యాప్తు అధికారులు అమిత్‌ షా వివరించారు. 

ఎటు చూసినా రక్తపు ముద్దలు 
‘‘శక్తివంతమైన పేలుడు దెబ్బకు కొద్దిసేపు మా చెవులు గిల్లుమన్నాయి. అసలేం జరిగిందో చూసేలోపే అంతటా మంటలు. చుట్టూతా ముక్కలైన మృతదేహాలు శరీరభాగాలు. కొన్ని ముక్కలు వాహనాలపై, మరొకొన్ని రోడ్లమీద పడ్డాయి. అంతటా రక్తపు మరకలు. మంటలు అంతెత్తున ఎగసిపడ్డాయి. పేలుడు ధాటికి ఎంతో ఎత్తున ఉండే హైమాస్ట్‌ వీధిదీపాలు సైతం పగిలిపోయాయి. దుకాణాల, మెట్రో స్టేషన్‌ గాజు ప్యానెళ్లు సైతం బద్దలయ్యాయి. 

సమీప వాహనాలు, అందులోని వాహనాదారులకు సైతం మంటలు అంటుకున్నాయి’’అని ప్రత్యక్ష సాక్షి, 36 ఏళ్ల అమిత్‌ ముద్గల్‌ భయంభయంగా చెప్పారు. ముగ్గురు పురుషులు ముక్కలై పడి ఉన్నారని మరో ప్రత్యక్ష సాక్షి భూపీందర్‌ సింగ్‌ చెప్పారు. ‘‘చాలా మంది చేతులు, వేళ్లు తెగి పడ్డాయి. ఒక కారు స్టీరింగ్‌ చక్రం విరిగిపోయింది. తోపుడు బళ్లు నడిపేవాళ్లు, ట్యాక్సీ డ్రైవర్లు మంటల్లో చిక్కుకుపోయారు. వాళ్లు బతకడం కష్టమే’’అని మరో ప్రత్యక్ష సాక్షి ఇర్ఫాన్‌ చెప్పారు. 

‘‘పేలుడు జరిగిన సెకన్లలోనే అక్కడంతా ఎర్రని పొగ అలుకుముంది. అక్కడున్న వారంతా భయంతో తలోదిక్కు పారిపోయారు. గాయాలతో కిందపడిన చాలా మందిని నేను అప్పటికే వచ్చిన అంబులెన్సుల్లోకి ఎక్కించా’’అని ఆయన అన్నారు. ‘‘నేనో ఆటో రిక్షా డ్రైవర్‌ను. సిగ్నల్‌ వద్ద నా ఆటోకు ముందువైపు కొంచెం దూరంలో ఓ కారు ఆగింది. దాని వెనుకభాగంలోనే పేలుడు సంభవించింది’’అని నుదుటికి గాయమైన డ్రైవర్‌ చెప్పారు. 

‘‘పేలుడు తీవ్రతకు నా దుకాణంలోని వస్తువులన్నీ ఒక్కసారిగా కంపించాయి’’అని సమీప దుకాణదారుడు వివరించారు. పేలుడు శబ్దం కిలోమీటర్‌ దూరంలో ఉన్న జామా సమీదు దాకా వినపడింది. పేలుడు ఘటనపై పుకార్లను ప్రచారం చేయొద్దని, సంయమనం పాటించాలని ఢిల్లీవాసులకు రాష్ట్ర మహిళా ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజ్ఞప్తిచేశారు.  

అమెరికా ఎంబసీ తమ పౌరులకు అలర్ట్‌ 
పేలుడు ఘటనపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. ఎర్రకోట వంటి జనం విపరీతంగా గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకూడదని తమ పౌరులకు అమెరికా ఎంబసీ సోమవారం ఒక భద్రతా అలర్ట్‌ను పంపించింది. స్థానిక యంత్రాంగం సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జనసమ్మర్ద ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. మరోవైపు పేలుడు ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌చేశారు. 

అన్ని దారులు పుల్వామాకే! 
ఢిల్లీ పేలుడుకు మూలాలు పుల్వామాలో ఉన్నాయని వార్తలొస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే సిద్ధాంతాలు వెలువడుతున్నాయి. సోమవారం కశ్మీర్, హరియణా, యూపీ సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడిన ఒక వైద్యుడు పుల్వామాకు చెందిన వ్యక్తే. 2019 ఫిబ్రవరి 14న సైనిక వాహనశ్రేణిపై దాడి జరిగింది పుల్వామాలోనే. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో కారు యజమాని తారిఖ్‌ సైతం పుల్వామాకు చెందిన వ్యక్తే.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement