PM PRANAM: రసాయన ఎరువులకు ‘పీఎం–ప్రణామ్‌’తో చెక్‌!

PM PRANAM scheme that aims to reduce use of chemical fertilisers - Sakshi

వాడకం బాగా తగ్గించేందుకు కేంద్రం కార్యాచరణ, ప్రత్యామ్నాయ ఎరువులకు ప్రోత్సాహం 

రాష్ట్రాల అభిప్రాయం కోరిన వైనం

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అంతేకాకుండా రసాయన ఎరువులపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రధానమంత్రి ప్రమోషన్‌ ఆఫ్‌ ఆల్టర్నేట్‌ న్యూట్రియంట్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ (పీఎం–ప్రణామ్‌) యోజనను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వినియోగం భారీగా పెరగడం, వాటిపై రాయితీలు మోయలేని భారంగా మారుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

సబ్సిడీల భారం రూ.2.25 లక్షల కోట్లు!  
దేశంలో రసాయన ఎరువుల వాడకం ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతోంది. 2017–18లో వినియోగం 5.28 కోట్ల మెట్రిక్‌ టన్నులు కాగా, 2021–22 నాటికి 6.40 కోట్ల మెట్రిక్‌ టన్నులకు (21శాతం) పెరిగింది. ఇందులో యూరియా వినియోగం 2017–18లో 2.98 కోట్ల మెట్రిక్‌ టన్నుల నుంచి 2021–22 నాటికి ఏకంగా 3.56 కోట్ల మెట్రిక్‌ టన్నులకు (19.64 శాతం) చేరుకుంది.

అలాగే డీఏపీ వినియోగం 98.77 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 1.23 కోట్ల మెట్రిక్‌ టన్నులకు (25.44 శాతం) పెరిగింది. ఇతర ఎరువుల వినియోగం సైతం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దానికి అనుగుణంగానే సబ్సిడీల భారం పెరుగుతూ వస్తోంది. 2020–21లో సబ్సిడీల భారం రూ.1.27 లక్షల కోట్లు కాగా, 2021–22 నాటికి రూ.1.62 లక్షల కోట్లకు చేరింది. 2022–23 నాటికి రూ.2.25 లక్షల కోట్లు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ‘పీఎం–ప్రణామ్‌’ పథకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.  

మిగిలే నిధులతో పథకం అమలు  
‘పీఎం–ప్రణామ్‌’ కింద కేంద్ర సర్కారు ఎలాంటి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించదు. వివిధ కేంద్ర పథకాల కింద ఉన్న ఎరువుల సబ్సిడీలను ఆదా చేయడం ద్వారా మిగిలే నిధులతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. మిగులు నిధుల్లో 50 శాతం సొమ్మును రాష్ట్రాలకు గ్రాంట్‌గా అందిస్తుంది. ఈ గ్రాంట్‌లో 70 శాతం నిధులను గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో ప్రత్యామ్నాయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వినియోగించవచ్చు.

మిగిలిన 30 శాతం నిధులను రసాయన ఎరువుల వాడకం తగ్గింపుపై రైతుల్లో అవగాహన కల్పించిన పంచాయతీలకు, రైతు సంఘాలకు, స్వయం సహాయక సంఘాలకు బహుమతులు ఇవ్వడానికి, ఇతర ప్రోత్సాహకాలకు ఉపయోగించుకోవచ్చు. పీఎం–ప్రణామ్‌ యోజనకు సంబంధించిన లక్ష్యాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల అభిప్రాయాలు పూర్తిగా తెలుసుకున్నాక తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top