ఏ అవగాహనా లేదు! | Sakshi
Sakshi News home page

ఏ అవగాహనా లేదు!

Published Mon, Feb 5 2024 5:02 AM

PM Narendra Modi Swipe At Cong In Assam - Sakshi

గువాహటి: కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన వారికి పూజనీయ స్థలాల గొప్పదనంపై కనీసం అవగాహన కూడా లేకుండా పోయిందంటూ దుయ్యబట్టారు. రెండు రోజుల అసోం పర్యటనలో భాగంగా ఆదివారం రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

అనంతరం గువాహటిలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. అసోంలోని కామాఖ్య ఆలయ కారిడార్‌ సిద్ధమయ్యాక ఈ శక్తి పీఠాన్ని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారన్నారు. ‘‘కామాఖ్య కారిడార్‌ ఈశాన్య పర్యాటకానికి గేట్‌వేగా మారనుంది. అక్కడి పర్యాటక రంగమంతటికీ ఊపునిస్తుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. ‘‘ఇలాంటి మహిమాని్వయ పూజనీయ స్థలాలెన్నో దేశవ్యాప్తంగా కొలువుదీరాయి. కానీ దశాబ్దాలపాటు దేశాన్నేలిన వారికి వాటి గొప్పదనం గురించిన అవగాహనే లేదు.

పైగా వారి స్వార్థ, స్వీయ రాజకీయ లబ్ధి కోసం మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల మనమే సిగ్గుపడే పరిస్థితులు కలి్పంచారు. తన మూలాలను, గతాన్ని విస్మరించిన ఏ దేశమూ అభివృద్ధి సాధించజాలదు. బీజేపీ పాలనలో గత పదేళ్లలో పరిస్థితులు మెరుగవుతూ వస్తున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా గుర్తించుకుంటున్నాం. ఒక్క 2023లోనే కాశీకి ఏకంగా 8.5 కోట్ల మంది పర్యాటకులు పోటెత్తారు.

ఉజ్జయినిని 5 కోట్లకు పైగా సందర్శించారు. అయోధ్యలో రామాలయం ప్రారంభమైన 12 రోజుల్లోనే పాతిక లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు’’ అని మోదీ వివరించారు. గత దశాబ్ద కాలంలో ఈశాన్య భారతానికి కూడా పర్యాటకులు రికార్డు స్థాయిలో పెరిగారన్నారు. భక్తి పర్యాటకం వల్ల నిరుపేదలకు కూడా మంచి ఉపాధి దొరుకుతుందన్నారు.

‘‘బీజేపీ కార్యకర్తగా నేను అసోంలో పని చేశా. అప్పట్లో గువాహటిలో రోడ్ల దిగ్బంధం, బాంబు పేలుళ్లు నిత్యకృత్యంగా ఉండేవి. ఇప్పుడదంతా గతం’’ అన్నారు. గువాహటిలో పలు మౌలిక రంగ ప్రాజెక్టులను మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. రూ.498 కోట్ల విలువైన కామాఖ్య ఆలయ కారిడార్‌తో పాటు మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. ఫోర్‌ లేన్‌ హైవేలు, మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులు తదితరాలు ఇందులో ఉన్నాయి.
 
విపాసన.. ఒత్తిళ్లపై దివ్యాస్త్రం: మోదీ
ముంబై: నిరాశలు, ఒత్తిళ్లపై విపాసన ధ్యాన పద్ధతి దివ్యాస్త్రమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘ప్రపంచానికి ప్రాచీన భారతదేశం అందించిన అత్యుత్తమ కానుకల్లో విపాసన ఒకటి. నేటి ఆధునిక జీవనశైలిలో భాగంగా మారిన ఒత్తిళ్లను దూరం చేసుకోవడానికి యువతతో పాటు అన్ని వయసుల వాళ్లకూ ఇదో చక్కని మార్గం’’ అని చెప్పారు. విపాసన బోధకుడు ఎస్‌.ఎన్‌.గోయంకా శత జయంత్యుత్సవాలను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు.

‘‘విపాసన ధ్యానపద్ధతి ఒక శాస్త్రం. చక్కని వ్యక్తిత్వ వికాస మార్గం. గోయంకా తన జీవితాన్ని సమాజ సేవకు ధారపోశారన్నారు. ‘‘గోయంకా గురూజీతో నాకెంతో సాన్నిహిత్యముంది. ఆయన జీవితం బుద్ధుని స్ఫూర్తితో సాగింది. సమామూహికంగా ధ్యానం చేస్తే అద్భుత ఫలితాలుంటాయని ఆయన నొక్కిచెప్పేవారు. ఆయన కృషి వల్ల 80 దేశాల వాళ్లు ధ్యానం ప్రాధాన్యతను, ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆచరిస్తున్నారు’’ అని వివరించారు.  
ఆదివారం గువాహటిలో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ  

Advertisement
 
Advertisement