
దుశ్చర్యలకు దీటుగా బదులు
సైన్యానికి మోదీ ఆదేశం
న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది.
చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.
దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ/వాషింగ్టన్: పాకిస్తాన్ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు.

అనంతరం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్‌తో కూడా వాన్స్ చర్చించారు. పాక్ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్–పాక్ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ
పాక్ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఆదేశం
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్ శనివారం ప్రకటించడం తెలిసిందే.
అయినప్పటికీ పాక్ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.