2025 నాటికి 25 నగరాల్లో మెట్రో

PM Narendra Modi inaugurates India first driverless train - Sakshi

డ్రైవర్‌లెస్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవంలో మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో అన్ని ప్రజా రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించే ‘నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌’నూ ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి దేశవ్యాప్తంగా ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండగా, ప్రస్తుతం ఆ సేవలు 18 నగరాలకు విస్తరించాయన్నారు.

ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంటే పట్టణాలో ‘మెట్రోలైట్‌’ విధానంలో తక్కువ ఖర్చుతో మెట్రో సేవలందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జల మార్గాలకు అవకాశమున్న నగరాల్లో ‘వాటర్‌ మెట్రో’ విధానం ఒక వినూత్న ఆలోచన అవుతుందన్నారు. ప్రస్తుతం మెజెంటా లైన్‌(జానక్‌పురి వెస్ట్‌ – బొటానికల్‌ గార్డెన్‌)లో ఈ ట్రైన్లు నడుస్తాయని, మరో ఆరు నెలల్లో పింక్‌ లైన్‌(మజ్లిస్‌ పార్క్‌ – శివ్‌ విహార్‌)లో ప్రారంభిస్తామని వెల్లడించింది. 21వ శతాబ్దపు భారత దేశ వైభవాన్ని ఢిల్లీ ప్రతిబింబించాలని  మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని పాత పర్యాటక నిర్మాణాలను ఆధునీకరించడంతో పాటు, నగరానికి 21వ శతాబ్దపు హంగులను అద్దనున్నామన్నారు.

సాగు ఉత్పత్తుల కోసం
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచేందుకు విప్లవాత్మక సంస్కరణలను ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్‌ విధానంలో సోమవారం 100వ కిసాన్‌ రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సాంగోలా నుంచి పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ వరకు ఈ కిసాన్‌ రైలు నడవనుంది. చిన్న, మధ్య తరహా రైతులు తమ ఉత్పత్తులను సూదూరంలో ఉన్న మార్కెట్లలో అమ్ముకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యం ఉన్న ఈ కిసాన్‌ రైళ్లు ఉపయోగపడ్తాయని ప్రధాని వివరించారు. ఈ రైళ్లకు రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా రైల్వే స్టేషన్లకు దగ్గరలో రైల్‌ కార్గో సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top