
ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో నిర్మాణం
ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 5 వేల చదరపు అడుగులు
గ్రీన్ టెక్నాలజీ, భూకంప నిరోధక టెక్నాలజీ
నేడు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన కొత్త నివాస గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో నిర్మించిన 184 టైప్–7 మల్టీ స్టోరీ ఫ్లాట్లను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఎంపీల నివాస సముదాయంలో ప్రధాని మోదీ ‘సిందూర’మొక్కను నాటి, ఆ తర్వాత నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో ముచ్చటిస్తారు.
అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగిచనున్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఎంపీల నూతన నివాస సముదాయం పార్లమెంట్ సభ్యుల అవసరాలకు తగిన అన్ని ఆధునిక సదుపాయాలతో ఉంటుంది. ప్రతి యూనిట్ విస్తీర్ణం సుమారు 5 వేల చదరపు అడుగులు కాగా, ఇందులో నివాసంతో పాటు అధికారిక పనులకు అనుకూలంగా గదులను కేటాయించారు.
సిబ్బంది నివాసాలు, కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్ వంటి సదుపాయాలు కల్పించారు. నివాస సముదాయంలో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. పర్యావరణ హిత సాంకేతికతతో నిర్మాణం చేపట్టి, గ్రీహా 3 స్టార్ రేటింగ్, నేషనల్ బిల్డింగ్ కోడ్–2016 ప్రమాణాలను అనుసరించారు.
దీంతో శక్తి పొదుపు, పునరుత్పత్తి ఇంధన వనరుల వినియోగం, వ్యర్థాల నిర్వహణలో మెరుగులు సాధ్యమవుతాయని అధికారులు పేర్కొన్నారు. అల్యూమినియం షట్టరింగ్ విధానంలో మోనోలితిక్ కాంక్రీట్ సాంకేతికతతో నిర్మాణం పూర్తి చేయడం వల్ల సమయానికి పనులు ముగిశాయని.. భూకంప నిరోధకంగా, దివ్యాంగులకు అనుకూలంగా ఈ భవనాలను రూపొందించారు. ప్రాజెక్ట్ కోసం భూమి పరిమితంగా ఉండటంతో అపార్ట్‌మెంట్ తరహా గృహ నిర్మాణం చేశారు.