ఇక బలీయ బంధం  | PM Narendra Modi and Lee Jae-myung held high-level talks in New Delhi | Sakshi
Sakshi News home page

ఇక బలీయ బంధం 

Apr 21 2026 4:07 AM | Updated on Apr 21 2026 6:01 AM

PM Narendra Modi and Lee Jae-myung held high-level talks in New Delhi

2030 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు వార్షిక వాణిజ్యం  

ఏడాదిలోగా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 

ఉన్నతీకరణ  భారత ప్రధాని మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ నిర్ణయం  

కీలక రంగాల్లో పరస్పర సహకారానికి 15 ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు  

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, దక్షిణ కొరియా నిర్ణయించుకున్నాయి. వార్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి.. 2030 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని తీర్మానించాయి. అంతేకాకుండా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఏడాది లోగా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్‌ సోమవారం ఢిల్లీలో సమావేశయ్యారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. 

ఈ సందర్భంగా కీలక రంగాల్లో సరస్పర సహకారానికి సంబంధించి ఇరుదేశాల మధ్య 15 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇంధనం, రక్షణ, అరుదైన ఖనిజాలు, నౌకా నిర్మాణం, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని మోదీ, లీ జే మ్యూంగ్‌ నిర్ణయించారు. ఇండియా–సౌత్‌ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఒక ఉమ్మడి వ్యూహాత్మక విజన్‌ను ఆవిష్కరించారు. నౌకా నిర్మాణం, నౌకా రవాణా, సముద్ర రవాణా రంగాల్లో భాగస్వామ్యం కోసం ఒక సమగ్ర విధానాన్ని భారత్, దక్షిణ కొరియా విడుదల చేశాయి. ఇంధన భద్రతపై ఒక సంయుక్త ప్రకటనను సైతం వెలువరించాయి.  

భారత్‌లో కొరియన్‌ పారిశ్రామిక టౌన్‌షిప్‌  
2010లో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఉన్నతీకరించడమే లక్ష్యంగా చర్చలను పునఃప్రారంభించడంపై ఒక ఉమ్మడి ప్రకటనపై భారత్, దక్షిణకొరియా సంతకాలు చేశాయి. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకొనే చర్యల్లో భాగంగా భారత్‌లో కొరియన్‌ పారిశ్రామిక టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. 

వాతావరణ మార్పు, ఆర్కిటిక్, సముద్ర సహకారంపై చర్చల కోసం న్యూఢిల్లీ, సియోల్‌ ‘ఎకనామిక్‌ సెక్యూరిటీ డైలాగ్‌’తోపాటు విదేశాంగ మంత్రిత్వ శాఖల ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రారంభించాయి. పశ్చిమాసియా పరిణామాలపై మోదీ, లీ జే మ్యూంగ్‌ చర్చించుకున్నారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు పెరుగుతుండడం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్‌ దిశగా ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేస్తామని భారత్, దక్షిణ కొరియా తేల్చిచెప్పాయి.  

అవి రెండు దేశాల డీఎన్‌ఏలో ఉన్నాయి  
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తమ రెండు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశాన్ని అందిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, దక్షిణ కొరియా మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 27 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు చెప్పారు. దీన్ని 2030 నాటికి 50 బిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ, చట్టబద్ధమైన పాలన పట్ల గౌరవం అనేవి రెండు దేశాల డీఎన్‌ఏలో ఉన్నాయని ఉద్ఘాటించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement