అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం | PM Modi to mark Gujjar deity Devnarayan birth anniversary in Rajasthan | Sakshi
Sakshi News home page

అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం

Jan 29 2023 5:46 AM | Updated on Jan 29 2023 6:25 AM

PM Modi to mark Gujjar deity Devnarayan birth anniversary in Rajasthan - Sakshi

జైపూర్‌: ‘‘సమాజంలో అణగారిన వర్గాల సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వంచిత్‌ కో వరీయత (పీడితులకు తొలి ప్రాధాన్యం) నినాదంతో సాగుతున్నామన్నారు. శనివారం రాజస్తాన్‌లో భిల్వారా జిల్లా మాలాసేరీ డుంగ్రీలో గుజ్జర్ల ఆరాధ్యుడు శ్రీదేవనారాయణ్‌ ఆధ్యాత్మిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రపంచ దేశాలు ఆశలు, ఆకాంక్షలతో భారత్‌ వైపు చూస్తున్నాయి. భారత్‌ తన బలాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తోంది, అంతర్జాతీయ వేదికలపై శక్తిని నిరూపించుకుంటోంది’’ అన్నారు.

పొరపాట్లను సరిదిద్దుకుంటున్న ‘నవ భారత్‌’   
స్వాతంత్య్ర పోరాటంతోపాటు ఇతర ఉద్యమాల్లో గుజ్జర్ల పాత్ర మరువలేనిదని మోదీ ప్రశంసించారు. వారికి చరిత్రలో తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘‘గత పొరపాట్లను ‘నవ భారత్‌’ సరిదిద్దుకుంటోంది. దేశాన్ని సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం చేసేందుకు  ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. నాగరికత, సంస్కృతి, సామరస్యం, శక్తి సామర్థ్యాల వ్యక్తీకరణే భారత్‌’’ అన్నారు. దేశ ఐక్యతను భగ్నం చేసే వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మన వారసత్వం మనకు గర్వకారణం  
వేలాది సంవత్సరాల భారతదేశ ప్రయాణంలో సామాజిక బలం గణనీయమైన పాత్ర పోషించిందని నరేంద్ర మోదీ వివరించారు. మన వారసత్వం మనకు గర్వకారణమని, బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని ఉద్బోధించారు. దేశం పట్ల మనం నిర్వర్తించాల్సిన విధులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. ‘‘ప్రజాసేవకు శ్రీదేవనారాయణ్‌ ప్రాధాన్యమిచ్చారు. ఆయన కమలంలో ఉద్భవించారు. భారత్‌ సారథ్యం వహిస్తున్న జి–20 లోగోలో కమలం ఉంది. బీజేపీ ఎన్నికల గుర్తయిన కమలంతో నాకెంతో అనుబంధముంది. గుజ్జర్‌ సామాజిక వర్గంతోనూ చక్కటి స్నేహ సంబంధాలున్నాయి’’ అన్నారు.

ఐక్యతా మంత్రమే విరుగుడు
న్యూఢిల్లీ: ప్రజల మధ్య విభేదాలు, అంతరాలను సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎన్నడూ విజయవంతం కాబోవని మోదీ అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప గ్రౌండ్‌లో ఎన్‌సీసీ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘దేశ పునర్వైభవ సాధనకు ఐక్యతే ఏకైక మార్గం. అన్నింటికీ అదే ఏకైక విరుగుడు. యువత తన ముంగిట ఉన్న అపార అవకాశాలను వాడుకోవాలి’’ అన్నారు.  ఎన్‌సీసీ 75వ వ్యవస్థాపక దినం సందర్భంగా ముద్రించిన 75 రూపాయల నాణేన్ని, కవర్‌ను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement