పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్‌’ తగ్గింపు

Petrol, Diesel Prices: Rajasthan, Odisha, Kerala Cut VAT on Fuel - Sakshi

మహారాష్ట్ర, కేరళ, రాజస్తాన్‌లలో మరింత ఊరట

న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) తగ్గించి, వినియోగదారులకు మరింత ఊరట కలిగించాయి. మహారాష్ట్ర, రాజస్తాన్, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌లో కోత విధించింది.

దీనివల్ల తమ ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. కేరళలోని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్డీఎఫ్‌) ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై 1.36 చొప్పున వ్యాట్‌ తగ్గించింది. తాము లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 చొప్పున తగ్గిస్తామని రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రకటించారు. పెట్రో పన్ను తగ్గింపును పరిశీలిస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు.
 

పన్నులు పెంచినప్పుడు సంప్రదించారా?: తమిళనాడు ఆర్థిక మంత్రి
పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు విషయంలో కేంద్రం పక్షపాతం ప్రదర్శించిందని తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ ఆదివారం విమర్శించారు. రాష్ట్రాలు సైతం పన్ను తగ్గించాలని కేంద్రం కోరడం సమంజసం కాదని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై పన్నులు పెంచినప్పుడు కేంద్రం ఏనాడూ రాష్ట్రాలను సంప్రదించలేదని తప్పుపట్టారు. 2021 నవంబర్‌లో కేంద్రం ప్రకటించిన పన్ను కోత వల్ల తమిళనాడు ఇప్పటికే రూ.1,000 కోట్లకుపైగా నష్టపోయిందన్నారు. కేంద్రం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించినా పెట్రో ధరలు 2014 నాటి కంటే అధికంగానే ఉన్నాయని ఆక్షేపించారు. 72 గంటల్లోగా పెట్రోల్, డీజిల్‌పై తమిళనాడు సర్కారు పన్ను తగ్గించాలంటూ రాష్ట్ర బీజేపీ అల్టిమేటం జారీ చేసింది.  

రాష్ట్రాలకు పన్ను నష్టం జరగదు: నిర్మల
పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో కోత పడుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఖండించారు. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీలో భాగమైన రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్సును మాత్రమే తగ్గించినట్లు తెలిపారు. ఈ సెస్సును రాష్ట్రాలతో కేంద్రం పంచుకోవడం లేదని ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాలో ఎలాంటి కోత ఉండదని తేల్చిచెప్పారు.

భారత్‌ భేష్‌: ఇమ్రాన్‌ ఖాన్‌  
పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్విట్టర్‌లో ప్రశంసించారు. దక్షిణాసియా ఇండెక్స్‌ రిపోర్టును ట్వీట్‌కు జతచేశారు. భారత ప్రభుత్వం రష్యా నుంచి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తుండడం, దేశీయంగా వినియోగదారుల కోసం ధర తగ్గించడం మంచి పరిణామం అని తెలిపారు. అమెరికా నుంచి ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ రష్యా చమురు విషయంలో భారత్‌ వెనక్కి తగ్గడం లేదని పేర్కొన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో తమ హయాంలోనూ ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రయత్నించామని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top