పార్లమెంటులో అదే సీను

Parliament sessions: Both houses adjourned till six day - Sakshi

న్యూఢిల్లీ: అదే గందరగోళం. అవే సీన్లు. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఎవరి పట్టు మీద వారు బెట్టుగా నిలిచారు. దాంతో పార్లమెంటులో వారం రోజులుగా కన్పిస్తున్న దృశ్యాలే రిపీటయ్యాయి. ఇరు పక్షాల డిమాండ్లు, హోరాహోరీ నినాదాలు, గందరగోళం మధ్య కార్యకలాపాలేవీ జరపకుండానే ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. అలా మార్చి 13న మొదలైన మలి విడత బడ్జెట్‌ సమావేశాల్లో వరుసగా ఆరో రోజూ పూర్తిగా వృథా అయింది.

సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను అధికార బీజేపీ సభ్యులు మరోసారి లేవనెత్తారు. ఆయన క్షమాపణలకు డిమాండ్‌ చేశారు. ప్రతిగా అదానీ గ్రూప్‌ అవకతవకల అంశాన్ని కాంగ్రెస్‌ సహా విపక్ష సభ్యులు తెరపైకి తెచ్చారు. తాము డిమాండ్‌ చేస్తున్న మేరకు దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించి తీరాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు.

ఇరు పక్షాలూ పెద్దపెట్టున నినాదాలు మొదలుపెట్టాయి. ఉభయ పక్షాలూ తన చాంబర్‌కు వస్తే చర్చించుకుని పరిష్కారానికి వద్దామని స్పీకర్‌ ఓం బిర్లా పదేపదే సూచించినా లాభం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కొన్ని బిల్లులను ప్రవేశపెట్టగానే ఇరువైపుల నుంచి తిరిగి నినాదాలు, గందరగోళం మొదలయ్యాయి. దాంతో సభను స్పీకర్‌    మంగళవారానికి వాయిదా వేశారు.

రాజ్యసభలోనూ...
అటు రాజ్యసభలోనూ దాదాపుగా ఇదే దృశ్యాలు కన్పించాయి. సభ ప్రారంభమవుతూనే ఇరు పక్షాలూ నినాదాలకు దిగాయి. వాటి మధ్యే చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించాలంటూ 267(9) నిబంధన కింద కాంగ్రెస్‌ సభ్యులు నోటీసు అందజేసినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను పక్కన పెట్టి నోటీసు అంశాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణకు సీపీఐ, సీపీఎం సభ్యులు డిమాండ్‌ చేశారు. నినాదాల హోరు, గందరగోళం అంతకంతకూ పెరిగిపోవడంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా, అనంతరమూ అదే పరిస్థితి కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది.

నా వ్యాఖ్యలపై లోక్‌సభలో మాట్లాడతా
స్పీకర్‌కు రాహుల్‌ లేఖ
‘‘భారత ప్రజాస్వామ్యం గురించి బ్రిటన్లో నేను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో స్పష్టత ఇస్తా. నేను మాట్లాడేందుకు అనుమతించండి’’ అంటూ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. దీనిపై ఆయన ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించలేదు. మంగళవారం మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశమివ్వాలని కోరినట్టు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘‘మేమేం మాట్లాడబోయినా మైకులు కట్‌ చేస్తున్నారు. ఇదే విషయాన్ని లండన్‌లో చెప్పినందుకు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాచారు’’ అని మండిపడ్డారు. రాహుల్‌ నివాసానికి పోలీసులు వెళ్లడాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్‌లో తాము లేవనెత్తుతన్న అదానీ, చైనా చొరబాటు వంటి కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తోందన్నారు.

కేసులకు బెదరను
వయనాడ్‌ (కేరళ): పోలీసు కేసులు, రాజకీయ దాడులతో తనను భయపెట్టలేరని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘సత్యంపై నాకు విశ్వాసముంది. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉన్నా. నాపై ఎంతగా దాడి చేసినా పట్టించుకోను. దాంతో, నేనెందుకు భయపడటం లేదా అన్నదే వారికిప్పుడు పెద్ద సమస్యగా మారింది’’ అని బీజేపీపై చెణుకులు విసిరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top