
మంచి అలవాట్లలో తల్లిదండ్రులే మార్గదర్శకులు
పెద్దలు చేస్తుంటే పిల్లలూ చూసి నేర్చుకుంటారు
కసుర్లు, విసుర్ల వల్ల ప్రయోజనం శూన్యం
పిల్లల్ని ఎంత ముద్దు చేసినా, వారికి బుద్ధుల్ని నేర్పించే వయసొకటైతే వచ్చేస్తుంది. అప్పుడిక క్రమశిక్షణ అలవాటు చేయాల్సిందే. అయితే ఆ శిక్షణ.. శిక్షలా ఉండకూడదు. ముద్దార నేర్పించినట్లుగా ఉండాలి. పిల్లలు మెత్తటి మట్టి ముద్దల్లాంటి వారు. వారిని చక్కగా మలచటం పెద్దల చేతుల్లోనే ఉంటుంది. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అనే సామెత ఎలాగూ ఉన్నదే! వాళ్లు మొక్కలుగా ఉన్నప్పుడే.. వాళ్లు మంచి అలవాట్లు, బాధ్యతలు నేర్చుకోవాలంటే.. అవి చేసి చూపించాల్సింది, పాటించాల్సింది మొదట తల్లిదండ్రులే.
స్కూల్లో టీచర్లు చదువు నేర్పటానికి ఒక సిలబస్ ఉన్నట్లే, ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పటానికి కూడా 6 సబ్జెక్టుల సిలబస్ ఒకటి ఉంది : ఆహారం, ఆటలు, నిద్రవేళలు, సమయపాలన, నియంత్రణ, సంభాషణ. ఈ ఆరు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయవలసింది పిల్లలు కాదు. తల్లిదండ్రులు! ఆ ఆరు సబ్జెక్టులు, ఆరు సిలబస్‌లు ఏమిటో చూద్దామా..– సాక్షి, స్పెషల్ డెస్క్
సబ్జెక్ట్ 1
ఆహారం
పిల్లలు అడిగినా అడగకున్నా ఏదో ఒకటి తినిపిస్తూ, తినేందుకు ఇస్తూ పేరెంట్స్ తమ ప్రేమను వెలిబుచ్చుతుంటారు. స్కూలుకు వెళ్లడానికి మారాం చేస్తే ఏదో ఒకటి షాపులో కొని ఇస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు.. జంక్‌ఫుడ్ ఎంత ప్రమాదకరమో! వారంలో ఎక్కువ రోజులు హోటళ్ల నుంచో లేదా ఆన్‌లైన్ ద్వారానో ఆహారం తెప్పించుకుని ఇంట్లో తినడం చేస్తే.. పిల్లలకు ఇక ఏం చెప్తాం?
ఎలా నేర్పించాలి?
చాక్లెట్లు, జంక్‌ఫుడ్, బయటి ఆహారం వంటివి ఎంత ప్రమాదకరమో వీడియోల ద్వారా వారికి అర్థమయ్యేలా చూపించాలి. కాస్త పెద్ద పిల్లలైతే పత్రికల్లో కథనాలు చూపించాలి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి వెబ్‌సైట్లలో సమాచారం చూపించాలి. తాజా పండ్లు, కూరగాయల వల్ల ప్రయోజనాలు తెలియజెప్పాలి. మీరు చెప్పే వాటిలో.. మీమీ ఆరోగ్య పరిస్థితులను బట్టి.. వీలైనంతవరకు పిల్లలతో కలిసి తినాలి.
సబ్జెక్ట్ 2
ఆటలు
పిల్లలకు కూడా వయసుకు తగిన శారీరక శ్రమ అవసరం. అవి లేకనే పిల్లల్లో స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఇలా నేర్పించండి: పిల్లలతో కలిసి మీరూ ఇంటి పనులు చేయండి. కలిసి తోట పని చేయండి. వాకింగ్ చేయండి. వాటి ప్రయోజనాలు వాళ్లకు వీడియోలు లేదా పత్రికల్లో కథనాల ద్వారా తెలియజేయండి.
సబ్జెక్ట్ 3
నిద్ర వేళలు
వేళకు నిద్రపోవటం, నిద్ర లేవటం మంచి అలవాటు. కానీ, చాలామంది పిల్లలు ఉదయాన్నే లేవరు. దాంతో వాళ్లను లేపి, రెడీచేసి, టిఫిన్ తినిపించేసరికి తల్లులకు తలప్రాణం తోకకి వస్తుంది.
మీరే ముందు లేవండి
సూర్యోదయానికంటే ముందే లేవడం మొదట తల్లిదండ్రులే ప్రారంభించాలి. ఇందుకోసం ముందు చేయాల్సిన రెండు విషయాలు.. రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం, బద్ధకాన్ని వదిలించుకోవడం. ఉదయాన్నే లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు పిల్లలకు చెప్పండి. విజయవంతమైన వ్యక్తులంతా.. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచినవాళ్లేనని వాళ్ల జీవిత చరిత్రలు వివరించండి.
పిల్లలను.. వాకింగ్ చేద్దామనో, అలా మేడమీదకు ఎండలోకి వెళ్లివద్దామనో నిద్రలేపండి. మొదట్లో లేవరు. కానీ, లేపడం మానొద్దు. నెమ్మదిగా అలవాటు అవుతుంది. మీరు వాకింగ్‌కో లేదా మేడమీదకో వాళ్లను తీసుకెళ్లినప్పుడు వాళ్లకు నచ్చిన విషయాలు జరిగితే వాళ్లే రోజూ మిమ్మల్ని లేపుతారు.
సబ్జెక్ట్ 4
సమయపాలన
అందరికీ ఉండేవి ఆ 24 గంటలే. అందులోనే మన నిత్య కృత్యాలకు, ఇతర పనులకు ఎంత సమయం కేటాయిస్తాం అన్నదానిపై మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
మీరు ఫాలో అవ్వండి
మీరు ఒక టైమ్ టేబుల్ వేసుకుని దాన్ని మీ ఇంట్లో ఒక గోడమీదనో మరోచోటో అంటించండి. దాన్ని చూసుకుని మరీ ఫాలో అవ్వండి. ప్రతిసారీ టిక్కులు పెట్టండి. మీరు చూస్తున్న, చేస్తున్న విషయం పిల్లలకు తెలియాలి. నెమ్మదిగా వాళ్ల బెడ్‌రూమ్‌లో కలర్‌ఫుల్‌గా వాళ్లతోనే ఒక టైమ్ టేబుల్ తయారుచేయించండి. లేదా వాళ్లే తయారుచేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
వాళ్లు కూడా మీలాగే చేసేందుకు ప్రయత్నిస్తారు. మొదట్లో.. వాళ్లు విజయవంతంగా దాన్ని ఫాలో అయిన ప్రతిరోజూ ఒక ప్రశంస లేదా బహుమతి ఏదో ఒకటి ఇవ్వండి. తరువాత వాళ్లకు మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అన్నీ చేసేస్తారు.
సబ్జెక్ట్ 5
నియంత్రణ
సోషల్ మీడియా వచ్చాక పెద్దలకు, పిల్లలకు కూడా స్మార్ట్ ఫోనే లోకం అయిపోయింది. టీవీలు చూస్తూ తినడం చేస్తున్నారు. చాలామంది పెద్దలు పిల్లలు చదువుకుంటుంటేనో, వాళ్లు చూస్తుండగానో లేదా వాళ్లతోనో.. గంటల తరబడి రీళ్లూ, వీడియోలూ, టీవీలో సినిమాలూ / వెబ్‌సిరీస్‌లూ చూస్తుంటారు.
మీకు మీరే నియంత్రించుకోండి
సోషల్ మీడియా, టీవీ ఉచ్చులోంచి ముందు మీరు బయటపడండి. పిల్లల ముందు, వాళ్లు చదువుకుంటున్నప్పుడు ఫోన్‌లో వీడియోలు చూడటం తగ్గించండి. అలాగే భోజన సమయంలో టీవీ ఆఫ్ చేయడం మీరు అలవాటు చేసుకోండి. ముఖ్యంగా రాత్రుళ్లు టీవీలూ ఫోన్లూ తగ్గించండి. ఉదయాన్నే త్వరగా లేవగలుగుతారు.
సబ్జెక్ట్ 6
సంభాషణ
ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాంటి వారినైనా ఎక్కడైనా బతికేలా చేయగలవు. ఇందుకు ప్రధానమైనవి.. సంభాషణా చాతుర్యం, మాటల్లో స్పష్టత, అవసరమైన చోట మృదుత్వం, ధైర్యంగా భావవ్యక్తీకరణ. ఇవి పిల్లలు.. బడిలో టీచర్లు, ఇంట్లో మిమ్మల్నే చూసి నేర్చుకుంటారని మర్చిపోవద్దు.
పిల్లలతో మాట్లాడండి.. వినండి
తల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ఉద్యోగాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా, పిల్లల కోసం తీరిక చేసుకోవాలి. వారి స్కూలు విషయాలను అడిగి తెలుసుకుంటుండాలి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఆ నమ్మకం వారికి కలగకపోతే వారు మనసువిప్పి మీతో మాట్లాడటం మానేస్తారు. సెలవు రోజుల్లో వారిని మీతోపాటు మార్కెట్‌కో, షాపుకో తీసుకెళ్లండి.. బయట ఎలా మాట్లాడాలో వాళ్లే నేర్చుకుంటారు.

ఓపిక పట్టండి
పిల్లలకు మంచి అలవాట్లు నేర్పటానికి పెద్దలకు ఓర్పు అవసరం.
» పిల్లలు అలవాటు పడేంత వరకు వారికి గుర్తు చేస్తూనే ఉండాలి.
» మంచి అలవాట్లు నేర్చుకునే విషయంలో పిల్లల ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించాలి.
» పిల్లలకు మీరు కొన్ని అలవాట్లను ఏర్పరచలేకపోతుంటే వారి ఉపాధ్యాయులు, పిల్లల వైద్యులు లేదా ఇతర నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి.