ఎంపీలను అడ్డుకున్న పోలీసులు

Opposition MPs prevented from meeting farmers at Ghazipur - Sakshi

ఘాజీపూర్‌ వద్ద రైతులను కలుసుకునేందుకు వెళ్లిన విపక్ష ఎంపీలు

జనవరి 26న ఢిల్లీలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక

న్యూఢిల్లీ/రాంపూర్‌: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఢిల్లీ శివార్లలోని ఘాజీపూర్‌ నిరసన కేంద్రం వద్దకు వెళ్లిన విపక్ష పార్టీల ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటి, రైతులను కలుసుకునే అవకాశం ఎంపీలకు కల్పించలేదు. శిరోమణి అకాలీదళ్, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ సహా 10 విపక్ష పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు గురువారం ఘాజీపూర్‌ సరిహద్దుకు వెళ్లారు.

ఎంపీల బృందంలో శిరోమణి అకాలీదళ్‌ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్, సుప్రియ సూలే(ఎన్సీపీ), కణిమొళి(డీఎంకే), తిరుచ్చి రవి(డీఎంకే), సౌగత రాయ్‌(టీఎంసీ) తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఘాజీపూర్‌ భారత్‌– పాకిస్తాన్‌ సరిహద్దులా ఉందని, రైతులు జైళ్లో ఉన్న ఖైదీలుగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రైతులను కలుసుకునేందుకు ప్రజా ప్రతినిధులమైన తమను పోలీసులు అనుమతించలేదని వివరించారు. గురువారం లోక్‌సభ భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు సుప్రియ సూలే, సౌగత రాయ్‌ స్పీకర్‌కు స్వయంగా ఈ లేఖను అందజేశారు.

మరోవైపు, ఢిల్లీ–యూపీ మార్గంలో ఉన్న ఘాజీపూర్‌ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయినా, వేలాది మంది రైతులు తీవ్ర చలిని తట్టుకుంటూ నిరసన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ– మీరట్‌ హైవేపైనే కొందరు విశ్రమిస్తున్నారు. మరోవైపు, జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన ఆందోళనల సమయంలో మృతి చెందిన రైతు నవ్రీత్‌ సింగ్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పరామర్శించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో ఉన్న దిబ్డిబ గ్రామంలో నవ్రీత్‌సింగ్‌ కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చి, వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరసన తెలుపుతున్న రైతులను ఉగ్రవాదులని, వారి ఉద్యమాన్ని రాజకీయ కుట్ర అని అవమానించడం ఆపేయాలని ప్రియాంక డిమాండ్‌ చేశారు. రైతులు, పేదల బాధను గుర్తించలేని నాయకులతో ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. నవ్రీత్‌ సింగ్‌ త్యాగం వృధా పోదని వారి కుటుంబసభ్యులకు చెప్పడానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. దిబ్డిబ వెళ్తుండగా, ప్రియాంక వాహన శ్రేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని 4 వాహనాలుæ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top