Operation Sindoor: 15 భారత సైనిక స్థావరాలపై గురి | Operation Sindoor Updates: Pakistan Attempted To Target 15 Indian Locations, More Details Inside | Sakshi
Sakshi News home page

Operation Sindoor Updates: 15 భారత సైనిక స్థావరాలపై గురి

May 9 2025 2:53 AM | Updated on May 9 2025 9:11 AM

Operation Sindoor: Pakistan attempted to target 15 Indian locations

తిప్పికొట్టిన సైన్యం, క్షిపణులు, డ్రోన్లు కూల్చివేత 

లాహోర్‌లో గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం 

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోబోయి పాక్‌ బొక్కబోర్లా పడింది. భారత్‌లోని 15 సైనిక స్థావరాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఉదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్‌లాయ్, భుజ్‌ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. అందుకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను తుత్తునియలు చేసింది. 

గురువారం మధ్యాహ్నం పాక్‌పై ప్రతి దాడులకు దిగింది. ఇస్లామాబాద్, సియాల్‌కోట్, లాహోర్, రావల్పిండిలపై విరుచుకుపడింది. లాహోర్‌లోని పాక్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్‌ కొనుగోలు చేసిన హెచ్‌క్యూ–9 మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ యూనిట్లను హర్పీ కామికాజ్‌ డ్రోన్లతో నేలకూల్చింది. ఈ దాడులను పాక్‌ కూడా ధ్రువీకరించింది. 

‘‘లాహోర్‌ సమీపంలో ఒక డ్రోన్‌ నేలకూలింది. గుర్జన్‌వాలా, చాక్వాల్, బహవల్‌పూర్, మియానో, కరాచీ, ఛోర్, రావల్పిండి, అతోక్‌ ప్రాంతాల్లో మరో 12 డ్రోన్లు ధ్వంసమయ్యాయి’’ అని అంగీకరించింది. లాహోర్‌లో నలుగురు సైనికులు గాయపడ్డారని, ఒక పౌరుడు మరణించాడని చెప్పింది. ‘‘పాక్‌ దుశ్చర్యకు అదే స్థాయిలో బదులిచ్చాం. ఎస్‌–400తో పాటు ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ యూఏఎస్‌ గ్రిడ్‌తో పాక్‌ క్షిపణులు, డ్రోన్లను కూల్చేశాం’’ అని సైన్యం ప్రకటించింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ రాడార్లు, వ్యవస్థలను నాశనం చేసినట్లు కేంద్రం పేర్కొంది. 

యుద్ధ వాతావరణం  
భారత దాడులతో లాహోర్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. వాల్టన్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సైరన్లు మోగడంతో జనం భయభ్రాంతులయ్యారని తెలిపింది. గాల్లో దట్టమైన పొగ వ్యాపించినట్లు వెల్లడించింది. యుద్ధ భయంతో పాక్‌లో సియాల్‌కోట్, కరాచీ, లాహోర్‌ సహా పలు ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. పాక్‌ నగరాల్లోని తమ పౌరులు తక్షణం దేశం వీడాలని, లేదా సురక్షిత ప్రాంతాలకు తరలాలని అమెరికా సూచించింది.  

పీఎంఓ భేటీ జరుగుతుండగానే! 
ఇస్లామాబాద్‌పై భారత్‌ దాడుల సమయంలో ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లతో నగరమంతా దద్దరిల్లిపోయింది. దాంతో సమీక్షను అర్ధంతరంగా నిలిపేసి ప్రధాని బృందం సురక్షిత ప్రాంతానికి తరలినట్టు సమాచారం. కాసేపటికే షహబాజ్‌ నివాస పరిసరాలు నేలమట్టం కావడంతో ఆయనను హుటాహుటిన పాతిక కి.మీ. దూరంలోని బంకర్‌లోకి తరలించినట్టు               చెబుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement