రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టీకా

Online Registration Must For 18 Plus To Get Covid Vaccine - Sakshi

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ  

28 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం 

వయల్‌లో టీకా మిగిలిపోతే ఆన్‌సైట్‌ అపాయింట్‌మెంట్లకు అనుమతి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 18 నుంచి 44 ఏళ్లలోపు వారికి కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. మే 1వ తేదీ నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. టీకా డోసు కోసం అపాయింట్‌మెంట్‌ పొందడానికి కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల సెంటర్ల వద్ద రద్దీని అరికట్టడానికే రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసినట్లు వెల్లడించింది. అయితే, 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి వ్యాక్సినేషన్‌ యథాతథంగా కొనసాగుతుందని, వారు నేరుగా వ్యాక్సిన్‌ కేంద్రానికి చేరుకొని, అక్కడికక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా వేయించుకోవచ్చని అధికారులు సూచించారు. 18–44 ఏళ్ల వయసున్న వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 28 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్‌ లేకుండా టీకా కోసం వస్తే అనుమతించరు. 18–44 ఏళ్లలోపు వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ అందజేస్తామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా టీకా కోసం ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వెళ్లేవారి కోసం ప్రభుత్వం మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఎన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి, వాటి ధర ఎంత అనే వివరాలను మే 1 నుంచి కోవిన్‌ పోర్టల్‌లో పొందుపరుస్తారు. అపాయింట్‌మెంట్‌ పొందే సమయంలో ఇష్టమైన టీకాను ఎంచుకోవచ్చు. 18–44 ఏళ్ల వయసువారు నిర్ణీత రుసుము చెల్లించి ప్రైవేట్‌ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో(సీవీసీ) టీకా వేయించుకోవచ్చు. కోవిషీల్డ్‌ ఒక్కో డోసును రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రూ.600 చొప్పున ధరకు విక్రయిస్తామని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఇక కోవాగ్జిన్‌ డోసును రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రూ.1,200 చొప్పున ధరకు అమ్ముతామని భారత్‌ బయోటెక్‌ సంస్థ వెల్లడించింది. 

వయల్‌లో టీకా మిగిలిపోతే..
అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల రకాలు, వాటి ధరలు, నిల్వల సమాచారాన్ని ప్రైవేట్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలు కోవిన్‌ పోర్టల్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ పొందినవారికే టీకా ఇవ్వాలని ప్రైవేట్‌ సీవీసీలకు సూచించారు. ఒక రోజులో చివరగా తెరిచిన సీసా(వయల్‌)లో ఇంకా డోసులు మిగిలిపోతే ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌/అపాయింట్‌మెంట్లకు అనుమతి ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. ఎంతో విలువైన టీకా వృథాను కనిష్ట స్థాయికి తగ్గించాలన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top