ఓ వైపు మృత్యు ఘోష.. మరోవైపు పరిమళించిన మానవత్వం

Odisha Train Accident: Queues For Rescue And Blood Donation - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా బాలాసోర్‌ రైలు ప్రమాద ఘటనతో మృతుల సంఖ్య  అంతకంతకు పెరుగుతూ పెను విషాదం అలుముకుంటున్న వేళ.. ఊహించని పరిణామాలు హ్యాట్సాఫ్‌ అనిపిస్తున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే పదుల సంఖ్యలో స్థానికులు స్వచ్ఛందంగా అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఆ దగ్గర్లోనే నేనున్నా. స్థానికులం కొందరు గుంపుగా ఇక్కడికి వచ్చాం. సహాయక సిబ్బందితో చేయి కలిపాం. దాదాపు 300 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం అని గణేష్‌ అనే యువకుడు చెప్తున్నాడు. అదీగాక చీకట్లో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడగా.. గ్యాస్ టార్చ్‌లు,  ఎలక్ట్రిక్ కట్టర్‌లతోసహాయక సిబ్బంది రాత్రంతా శ్రమించింది. వాళ్లకు స్థానికుల్లో కొందరు యువకులు సహయపడడం గమనార్హం. 

 
ఒడిషా ప్రజలు.. ప్రత్యేకించి యువత ఆస్పత్రులకు రక్తదానం కోసం క్యూ కడుతున్నాయి. ఎన్జీవోలు, పలువురు సామాజిక కార్యకర్తలు వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో ఇచ్చిన పిలుపునకు యువత అనూహ్యంగా స్పందించింది.  భువనేశ్వర్‌తో పాటు బాలేశ్వర్‌, భద్రక్‌, మయూర్‌భంజ్‌, కటక్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల కోసం రక్తం ఇవ్వడానికి బారులు తీరారు. రక్తదానానికి ముందుకు రావాలంటూ పిలుపుతో లొకేషన్లను షేర్‌ చేస్తూ వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టేందుకు కృషి చేసిన స్థానిక సహాయక బృందాలతో పాటు స్థానికులకూ సీఎం నవీన్‌ పట్నాయక్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. 

మరోవైపు 200 ఆంబులెన్స్‌లు, 50 బస్సులు, 45 మొబైల్‌ హెల్త్‌ యూనిట్‌లో బాలాసోర్‌లో ప్రమాదం జరిగిన స్థలం వద్ద మోహరించింది ఒడిశా ప్రభుత్వం. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా 1,200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కోల్‌కతాతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల  నుంచి ప్రత్యేక దళాలు అక్కడికి చేరుతున్నాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తరపున హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

తమిళనాడు సీఎం స్టాలిన్‌  పరిస్థితిపై ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నారు. ఒక్కరోజు సంతాప దినం ప్రకటించారాయన. అలాగే ఒక ప్రత్యేక బృందాన్ని అక్కడికి పంపాలని నిర్ణయించారు. 

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ప్రమాద ఘటనపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారాయన. మంత్రి అమర్నాథ్‌ నేతృత్వంలో ఐఏఎస్‌ అధికారులతో కూడిన బృందాన్ని బాలాసోర్‌కు పంపించాలని నిర్ణయించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top