ఆఫీస్‌ పని వేళలో మందేసిన అధికారి.. ఫొటోలు, వీడియోలు వైరల్‌

Odisha Health Officer Consumed Liquor Viral Video - Sakshi

భువనేశ్వర్‌: అధికారం ఆయన చేతుల్లో ఉంది. ఇంకేం.. ఆఫీస్‌ను తన ఇష్టారాజ్యంగా మార్చేసుకున్నాడు. ఉద్యోగులపై వేధింపులకు పాల్పడడం చాలదన్నట్లు.. ఆఫీస్‌ వేళలో అదీ తన క్యాబిన్‌లోనే ఎంచక్కా చుక్కేశాడు. అంతటితో ఆగకుండా ఆ మైకంలో పచ్చిబూతులు మాట్లాడుతూ.. ఆ వీడియో, ఫొటోల ద్వారా వైరల్‌ అయిపోయాడు. ఒడిశా గాంజామ్‌ జిల్లా ఆరోగ్య విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో.. రాష్ట్రీయ బాల్‌ సురక్ష కార్యక్రమ(ఆర్బీఎస్కే), రాష్ట్రీయ కిషోర్‌ స్వస్థ్య కార్యక్రమ(ఆర్కేఎస్కే) ప్రొగ్రామ్‌ల కింద అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు సందీప్‌ మిశ్రా. ఈయన వ్యవహార శైలిపై గతంలోనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈసారి పక్కా ఆధారాలతో ఆయన్ని పట్టించారు కొందరు ఉద్యోగులు. ఆఫీస్‌ వేళలో తన కుర్చీలో తాగుతూ ఆయన మాట్లాడిన మాటలు, ఫొటోలు స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అయ్యాయి. 

ఇదిలా ఉంటే.. వైరల్‌ వీడియో, ఫొటోలపై సందీప్‌ మిశ్రా స్పందించారు. ఇదంతా కుట్ర అని, అవి ఎడిటింగ్‌ చేసిన ఫొటోలనీ, తనను బద్నాం చేసేందుకు జరిగిన కుట్ర అని చెప్తున్నారాయన. ‘‘ఆఫీస్‌లో ఏనాడూ నేను మందు తాగలేదు. అసలు అందులో కనిపించిన బ్రాండ్‌లు నేనెప్పుడూ రుచి చూడలేదు. నా బిడ్డల మీద ఒట్టు.. అది మార్ఫింగ్‌ చేసినవి అయి ఉండొచ్చు’’ అని సందీప్‌ చెప్తున్నాడు.

తాగిన మత్తులో ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడతాడని, మహిళా ఉద్యోగులతో అనుచితంగా ప్రవర్తిస్తాడని ఓ ఉద్యోగిణి వెల్లడించారు. ఈ విషయంపై గాంజామ్‌ జిల్లా చీఫ్‌ డిస్ట్రిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఉమాశంకర్‌ మిశ్రా స్పందించారు. వీడియో తమ దృష్టికి రావడంతో సందీప్‌ మిశ్రాకు షోకాజ్‌ నోటీసులు పంపినట్లు తెలిపారు. నివేదిక రాగానే చర్యలపై నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగం కోసం ఇలా కూడా చేస్తారా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top