క‌స్ట‌మ‌ర్ కు రూ.40వేలు చెల్లించిన అమెజాన్

Odisha Consumer Commission Directs Amazon to Pay Customer - Sakshi

ఒడిశా: ఆన్‌లైన్‌లో స‌హ‌జంగానే ఈ-కామ‌ర్స్ సైట్ల‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని వ‌స్తువులు చాలా త‌క్కువ ధ‌ర‌‌కు లభిస్తాయి. కొన్ని సార్లు ఈ ఆఫర్లు నిజమేనా అని మనం కూడా ఆశ్చర్యపోతుంటాం. ఈ-కామ‌ర్స్ సైట్ల నిర్వాహ‌కులు సాధారణ సమయాలలో కూడా పలు సేల్స్ పేరిట వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. తాజాగా ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్ సైట్‌లో తలెత్తిన సాంకేతిక కారణంగా ఒక వినియోగదారుడికి న‌ష్ట‌ప‌రిహారంగా రూ.45వేలు చెల్లించాల్సి వచ్చింది.(చదవండి: పెన్షన్ పొందేవారికి కేంద్రం శుభవార్త)

వివరాల్లోకి వెళ్లితే.. ఒడిశాకు చెందిన సుప్రియో రంజన్ మహాపాత్ర అనే న్యాయ విద్యార్థి 2014లో అమెజాన్‌లో ఒక ల్యాప్‌టాప్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు రూ.23,499 విలువైన ల్యాప్‌టాప్‌ రూ.190 ఆఫర్ కింద లభించడంతో దాన్నీ ఆర్డర్ చేసుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఆర్డర్ రద్దు కావడంతో అమెజాన్ కస్టమర్‌ను సంప్రదించాడు. అమెజాన్ కస్టమర్‌ కేర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సాంకేతిక స‌మ‌స్య కారణంగా తక్కువ ధర చూపించిందని తెలపడంతో పాటు ఆ ఆర్డర్ ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అతను ఈ విషయాన్నీ విడిచిపెట్టకుండా ఒడిశా వినియోగ‌దారుల ఫోరంను ఆశ్ర‌యించాడు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అత్యవసరంగా ల్యాప్‌టాప్ అవసరం ఉన్నందున తాను రూ.190కి ల్యాప్‌టాప్ అని చూసి దాన్ని ఆర్డ‌ర్ చేస్తే అమెజాన్ దాన్ని రద్దు చేసింద‌ని, క‌నుక త‌న‌కు న్యాయం చేయాల‌ని అత‌ను కోరాడు. కొన్నేళ్ల పాటు సాగిన ఈ విచారణ తాజాగా ముగిసింది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆర్డర్ రద్దు చేసినందుకు బాధితుడికి నష్ట పరిహారం కింద రూ.40వేలు, ఖ‌ర్చుల కింద మ‌రో రూ.5వేల‌ను అమెజాన్ చెల్లించాల‌ని తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ వార్త చదివిన చాలా మంది నిజమే వినియోగదారుడిని మోసం చేసినందుకు అమెజాన్ కు కమిషన్ సరైన శిక్ష విధించిందని పేర్కొన్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top